మహారాష్ట్ర కొల్హాపూర్ పరిధిలోని కస్బా బావడా గ్రామానికి చెందిన సుధాకర్ పాటిల్.. వినూత్నంగా మేడపైనే వరిసాగు చేసి ఔరా అనిపించారు. సేంద్రీయ వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో వరితోపాటు ఇంటిపైనే పండ్లు, కూరగాయలు పసుపు, మిరియాలు, తృణధాన్యాలను సాగు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు.
లాక్డౌన్ ఆలోచన..
![Agriculture enthusiast successfully grows rice on terrace using unique method](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9094538_333_9094538_1602147698033.png)
లాక్డౌన్లో వచ్చిన ఆలోచనతో ఇంటివద్దే వరి పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నారు పాటిల్. టెర్రస్‌పై ప్లాస్టిక్ డబ్బాలలో మట్టిని నింపి.. అందులో విత్తనాలను వేసి సాగు చేశారు. తాను పండించిన ధాన్యం కొన్ని నెలల వరకు తన కుటుంబానికి సరిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. రసాయనాలు వాడకుండా పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలోనే సాగు చేసినట్లు వివరించారు సుధాకర్ పాటిల్.
![Agriculture enthusiast successfully grows rice on terrace using unique method](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-kop-01-rice-sowing-on-terrace-story-2020-7204450_07102020123327_0710f_00774_331.jpg)
"కేవలం 4వేల చదరపు అడుగుల స్థలంలో సంవత్సరానికి సరిపడా అనేక రకాల పంటలను సాగు చేయవచ్చు" అని పాటిల్ వివరించారు. అయితే సీజన్ ఆధారంగానే పంటలు పండించాలని స్థానిక రైతులకు సూచనలూ ఇస్తున్నారు. అంతేకాదు ఆర్గానిక్ వ్యవసాయ ప్రయోజనాల గురించి పాటిల్ ప్రచారం చేస్తూ మెప్పుపొందుతున్నారు.