ఒడిశా మల్కాన్‌గిరి జిల్లా ఆసుపత్రిలో విధుల్లో ఉన్న ముగ్గురు నర్సులు టిక్‌టాక్ చేసి ఇక్కట్ల పాలయిన కొద్ది రోజుల్లోనే మరో వీడియో వైరల్‌గా మారింది. అదే రాష్ట్రంలోని కటక్ నగరంలోని ఎస్సీబీ వైద్య కళాశాలలో ఇద్దరు మహిళా సహాయకులు కీళ్ల సంబంధిత వార్డులో నృత్యాలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ విషయంపై విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆసుపత్రి సూపరింటెండెంట్ మొహంతి.
ఆసుపత్రిలోని కీళ్ల (ఆర్థోపెడిక్) వార్డులో ఈ నృత్యాలు చేశారు. ఆ సమయంలో ఇద్దరు మహిళా సహాయకులు రోగులు ఉండగానే మ్యూజిక్ పెట్టుకుని నాట్యం చేశారు.
నృత్యాలకు సంబంధించిన దృశ్యాలు రికార్డు చేసినట్లు తనకు తెలియదని చెప్పింది అందులో కనిపించిన ఓ సహాయకురాలు.
"వార్డులో పనిచేసే యువతి నృత్యం చేయాలని అడిగితే.. అయిష్టంగానే కొన్ని స్టెప్పుల్లో పాల్గొన్నా. ఈ సంఘటన జరిగి సుమారు 6-7 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఎలా వైరల్‌గా మారాయో నాకు తెలియదు. "
- అటెండర్
మల్కన్‌గిరి నర్సులపై చర్యలు...
టిక్‌టాక్ వీడియో చేస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఒడిశా మల్కన్‌గిరి జిల్లా ఆసుపత్రి నర్సులపై చర్యలు తీసుకున్నారు జిల్లా వైద్యాధికారి. షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇదీ చూడండి: వైరల్: విమానాన్ని ఢీకొట్టిన 'పక్షిరాజు'