వాస్తవాధీన రేఖ వెంబడి భారత్- చైనా మధ్య జరిగిన ఆరో విడత కమాండర్ స్థాయి భేటీలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. సమావేశంలో ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి దాపరికాలు లేకుండా అభిప్రాయాలు పంచుకున్నట్లు భారత సైన్యం వెల్లడించింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని హృదయపూర్వకంగా అమలు చేసేందుకు ఉభయ పక్షాలు అంగీకారానికి వచ్చినట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు సోమవారం 14 గంటల పాటు జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి భేటీలో చర్చించుకున్న అంశాలపై ఇరుదేశాల సైన్యం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అపార్థాలు నివారించేలా భారత్, చైనా సైన్యాలు.. సమాచారాన్ని పంచుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటనలో స్పష్టం చేశాయి.
ఆచరణాత్మక చర్యలు
సరిహద్దుకు సైన్యాన్ని తరలించకుండా ఉండటం సహా, క్షేత్రస్థాయిలో యథాతథ స్థితిని మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలని ఇరువురు అంగీకరించుకున్నారని భారత సైన్యం వెల్లడించింది. పరిస్థితిని మరింత కఠినతరం చేసే ప్రయత్నాలేవీ చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. సమస్య పరిష్కారానికి ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని ఏకాభిప్రాయానికి వచ్చాయని స్పష్టం చేసింది.
వీటితో పాటు వీలైనంత త్వరలో ఏడో విడత సైనిక స్థాయి చర్చలు నిర్వహించుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయని ఆర్మీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి- ఆరోసారి భారత్-చైనా సైనిక కమాండర్లు భేటీ