పార్లమెంట్లో మూడు కార్మిక సంస్కరణ బిల్లులు ఆమోదం పొందటంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్. రైతుల తర్వాత కార్మికులను లక్ష్యంగా చేసుకుని బిల్లులను తీసుకొచ్చారని కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
ఈ బిల్లులపై రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
" రైతుల తర్వాత కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. పేదలను దోపిడి చేయటం, స్నేహితులను పోషించటం మోదీ జీ పని."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
అంతకుముందు ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనటంపై విమర్శలు చేశారు రాహుల్. రైతుల సమస్యలపై మాట్లాడటానికి బదులుగా ఇతర కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్రతిఒక్కరి జీవనోపాధిని పరిరక్షించించేలా చూడటం చాలా అవసరమని పేర్కొన్నారు ప్రియాంక. కానీ, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.
" భాజపా ప్రభుత్వ ప్రాధాన్యతలను పరిశీలిస్తే.. ఉద్యోగులను సులభంగా తొలిగించేందుకు అవకాశం కల్పించే చట్టాలను తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం దారుణాలకు పాల్పడటాన్ని సులభతరం చేసింది. "
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
కంపెనీలను మూసివేయడానికి ఉన్న అవరోధాల తొలగింపు సహా, 300ల వరకు ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి లేకుండానే తొలిగించేందుకు వీలు కల్పిస్తోన్న మూడు కీలక కార్మిక బిల్లులకు ప్రతిపక్ష పార్టీలు లేకుండానే బుధవారం మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు మంగళవారమే ఈ బిల్లులను ఆమోదించింది లోక్సభ. బిల్లుపై చర్చ సందర్భంగా మారుతున్న వ్యాపార వాతావరణానికి అనుగుణంగా పారదర్శక వ్యవస్థను అందించేందుకే కార్మిక సంస్కరణలను చేపట్టినట్లు తెలిపారు కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్. ఈ బిల్లులో తీసుకొచ్చిన పలు అంశాలను ఇప్పటికే 16 రాష్ట్రాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
వ్యవసాయ బిల్లుల్లో లొసుగులు: కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల్లో సమస్యలు, లొసుగులు ఉన్నాయన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వాటిని ఆమోదించేందుకు రాజ్యసభలో చేపట్టిన ఓటింగ్ ప్రశ్నార్థకంగా, ఖండించదగినదిగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపడుతున్నారన్నారు.
ఇదీ చూడండి: కీలకమైన మూడు కార్మిక బిల్లులకు ఆమోదం