అడ్వాణీ స్థానంలో అమిత్ షా పోటీచేయటం కేవలం రాజకీయ మార్పేనని అభిప్రాయపడింది. భీష్మాచార్యుడికి బలవంతంగా విశ్రాంతినిచ్చే క్రమంలో జరిగిన చర్యగా తన పత్రిక సామ్నాలో పేర్కొంది. లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని తెలిపింది. భాజపాలో అడ్వాణీ శకం ముగింపునకు వచ్చినట్లు పేర్కొంది.
"గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి అడ్వాణీ ఆరుసార్లు గెలిచారు. ఆ స్థానంలో అమిత్ షా పోటీ చేయటానికి అర్థం... అడ్వాణీకి బలవంతంగా విశ్రాంతినివ్వటమే. భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో అడ్వాణీ ఒకరు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీతో పాటు పార్టీని నడిపించారు. ఇప్పుడు మోదీ, షా వారి స్థానాలను తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్లు ఎలాంటి బాధ్యత పొందలేని వాతావరణం నెలకొంది. రాజకీయ రంగంలో సుదీర్ఘకాలం కొనసాగారు అడ్వాణీ. ఇప్పటికీ ఆయనే భాజపాకు అగ్ర నాయకుడు. " - శివసేన
భాజపా దేశవ్యాప్తంగా విస్తరించడానికి అడ్వాణీ ప్రధాన కారణమని ప్రశంసించింది శివసేన. 1990లో అడ్వాణీ చేసిన రథయాత్ర వల్లే ఆ పార్టీ అగ్రస్థానానికి చేరుకుందని స్పష్టం చేసింది. ఆయన కృషివల్లే ఫలితం పొందిందని అభిప్రాయపడింది.
కాంగ్రెస్‌పై విమర్శలు
గాంధీనగర్ స్థానాన్ని అడ్వాణీ నుంచి లాక్కున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది శివసేన. సీనియర్ నాయకులను కించపరిచేలా మాట్లాడకూడదని హెచ్చరించింది. కాంగ్రెస్ పార్టీ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో పి.వి.నరసింహారావు ముందుండి నడిపించారని, కానీ ఆయనను మరణానంతరం కాంగ్రెస్ అవమానించిందని పేర్కొంది. సీనియర్ నాయకుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని విమర్శించింది.