ప్రస్తుత రోజుల్లో యువత చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిసలవుతున్నారు. అలాంటి వారు ఏ వయస్సు నుంచి మత్తు పదార్థాలను అలవాటు చేసుకుంటారు అనే అంశంపై దక్షణ ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కళాశాలకు చెందిన చరిత్ర విభాగ విద్యార్థులు సర్వే చేపట్టారు.
ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. చట్టపరంగా కనీస వయసు 21 రాకముందే మత్తుకు బానిసలవుతున్నట్లు తేలింది. ముంబయి, పుణె, దిల్లీ, కోల్‌కతా, రాజస్థాన్ వంటి ప్రముఖ నగరాల్లో 16 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల 1000 మంది యువతపై సర్వే నిర్వహించారు. ఇందులో సుమారు 75 శాతం మంది 21 ఏళ్లలోపే మద్యం తాగుతున్నట్లు తెలిసింది.
మన దేశంలోని ప్రముఖ నగరాల్లోనే కాకుండా చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్, హంగేరీ, మధ్య ఐరోపా దేశాలలోని యువతపై సర్వే చేశారు.
"ప్రస్తుత రోజుల్లో యువత పలు వ్యసనాలకు బానిసలవుతున్నారు. వారు మత్తు పదార్థాలకు బానిసలవ్వటానికి జన్యుపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, మరే ఇతర కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవటమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం."
-ప్రొఫెసర్ డా.అవ్కాశ్ జాదవ్, చరిత్ర విభాగాధిపతి.
నివేదిక ప్రకారం..
సర్వే నివేదిక ప్రకారం 21 సంవత్సరాల వయసు లోపే మద్యం స్వీకరించేవారు 75 శాతం, సిగరెట్లు అలవాటు ఉన్న వారు 47 శాతం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారు 20 శాతం, హుక్కాను స్వీకరించేవారు 30 శాతంగా ఉన్నట్లు తేలింది. 16 నుంచి 18 మధ్య వయస్సు కలిగిన యుక్త వయసు యువత ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నట్లు నివేదిక పేర్కొంది.
అయోమయంలో 83 శాతం..
మత్తు పదార్థాలకు బానిసలైన సుమారు 17 శాతం మంది వివిధ మార్గాల ద్వారా వ్యసనాల నుంచి బయటపడినట్లు తెలిపింది నివేదిక. మిగతా 83 శాతం మంది మత్తు నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారని పేర్కొంది.
కమిషనర్‌కు..
ఈ సర్వే పూర్తి నివేదికను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ) సూపరింటెండెంట్ భూమేష్ అగర్వాల్‌కు సమర్పించారు.
ఇదీ చూడండి:భూటాన్‌లో కూలిన భారత హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి