బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ రాష్ట్రీయ సమాజ్ పక్ష్ పార్టీలో (ఆర్ఎస్పీ) చేరనున్నారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మహారాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి మహదేవ్ జన్కర్ వెల్లడించారు. సెప్టెంబర్ 25న ఆర్ఎస్పీ తీర్థం పుచ్చుకుంటారని స్పష్టం చేశారు.
ఆర్ఎస్పీ పార్టీకి సంజయ్ శుభాకాంక్షలు తెలిపి... తనను సహోదరుడిగా పిలిచే వీడియోను సమావేశంలో చూపించారు జనకర్.
2009లో సమాజ్‌వాదీ పార్టీ లఖ్‌నవూ ఎంపీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల్లో నామపత్రాలు దాఖలు చేశారు సంజూ. తనపై ఉన్న అక్రమ ఆయుధాల కేసును కొట్టేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించిన కారణంగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అనంతర కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ ఖల్నాయక్ రీఎంట్రీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందూ సంజూ రాజకీయాల్లో చేరతారనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
ఆర్ఎస్పీ...
2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి మహారాష్ట్ర అధికార కూటమిలో కొనసాగుతోంది రాష్ట్రీయ సమాజ్ పక్ష్ పార్టీ (ఆర్ఎస్పీ). సినీ పరిశ్రమలోని ప్రముఖులను పార్టీలోకి చేర్చుకుని విస్తరించాలని అనుకుంటున్నట్లు... ఇందులో ధన్గర్, షెపర్డ్ సామాజిక వర్గాలకు చెందినవారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు జన్కర్ తెలిపారు.
ఇదీ చూడండి: సీఎం కాన్వాయ్‌ని బైక్‌తో ఢీకొట్టిన యువకుడు