తమిళనాడు రామనంతపురం మాజీ ఎంపీ, సినీ నటుడు జేకే రితీష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. రితీష్ మరణ వార్త ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రామనంతపురంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హూటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రితీష్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సామాజిక మాధ్యమాలు వేదికగా రితీష్కు అభిమానులు నివాళుర్పించారు. తమ అభిమాన నాయకుడిని చివరి సారి చూసేందుకు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.
శ్రీలంకలోని కండ్యాలో జన్మించిన రితీష్ 1976లో తమిళనాడులోని రామేశ్వరానికి వలసవచ్చారు. అనంతరం వెండితెర వైపు వెళ్లారు. కానల్ నీర్లో మొదటి సారి నటించారు. నాయగన్, ఎల్కేజీ వంటి చిత్రాల్లోనూ నటనతో ఆకట్టుకున్నారు.
2009 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే తరఫున పోటీ చేసి రామనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో డీఎంకేకి రాజీనామా చేసి ఏఐఏడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయంగా, సినీ నటుడిగా తమిళ ప్రజల మన్ననలు పొందారు రితీష్.