తమిళనాడులో ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించాడు. ఇంటివద్ద పోలీసులు ఉండగానే రెండు గ్యాస్ సిలిండర్లను పక్కన పెట్టుకుని బెదిరించాడు. తనకేదో అన్యాయం జరిగింది భావిస్తే పొరపాటే.. అతని ప్లాన్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.
ఆంథోనీ.. కన్యాకుమారిలోని సుచింద్రంలో తన ఇద్దరు భార్యలతో కలిసి నివసిస్తున్నాడు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఓ విదేశీ ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు కూడా ఉంది.
అయితే అక్రమ రవాణాకు సంబంధించిన ఓ కేసులో ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు ఆంథోనీని అరెస్టు చేసేందుకు ఇంటికి వచ్చారు. ఇది గమనించి అప్రమత్తమైన నిందితుడు.. ఇంటి లోపలి నుంచి తాళం వేసి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
వెనుదిరిగిన పోలీసులు..
ఈ తతంగమంతా ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు వెనక్కితగ్గారు. చేసేదేం లేక అతన్ని అరెస్టు చేయకుండా వెనుదిరిగారు.
ఇలా చేస్తే ఎలా?
ఇలా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే నేరస్థులను ఎలా పట్టుకునేది? అని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ దూకుడుగా వ్యవహరిస్తే.. వాళ్లు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే పోలీసులకే చెడ్డ పేరు వస్తుందని ఓ అధికారి అన్నారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-3: భూమిపై జాబిల్లి బిలాల సృష్టి!