లాభాల బాటలో నడిచే ఎన్నో వ్యాపారాలను కరోనా తీవ్రంగా ప్రభావితం చేసింది. చిన్నవే కాదు.. ఎన్నో పెద్ద పరిశ్రమలూ మహమ్మారి దెబ్బకు ప్రాభవం కోల్పోయాయి. కర్ణాటకలోని కంచి పట్టు చీరల పరిశ్రమ కూడా కరోనా ధాటికి దెబ్బతిన్న వాటిల్లో ఒకటి.
మొదటగా.. మాండ్య జిల్లాలోని కొడియాల రైతులు తమ పొలాల్లో పట్టుపురుగుల పెంపకం ద్వారా.. కంచి చీరల తయారీకి శ్రీకారం చుట్టారు మైసూరు రాజులు. ప్రజలకు బతుకుదెరువు కల్పించేందుకు పట్టుపోగు నుంచి వస్త్రాలు తయారు చేయించాలని నిర్ణయించారు. ఇందుకోసం మాండ్య జిల్లాలోని 5ప్రాంతాలు ఎంపిక చేయగా అందులో కొడియాల ఒకటి. శ్రీరంగ పట్టణంలోని కొడియాల వాసులు.. అప్పటినుంచి కంచిపట్టు చీరల తయారీని కొనసాగిస్తున్నారు.
"ఒకప్పుడు ఇక్కడ 600 చేతిమగ్గాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఐదారు మాత్రమే వాడకంలో ఉన్నాయి. అప్పట్లో చేతిమగ్గాల మీదనే చీరలు నేసేవాళ్లు. ఇప్పుడు వాటి స్థానంలో పవర్లూమ్స్ వచ్చేశాయి. పైగా కరోనా ధాటికి ప్రస్తుతం ఒక్క మగ్గం కూడా పనిచేయడం లేదు."
- రామకృష్ణ, చేనేత కళాకారుడు
పదివేల మందికిపైగా..
కొడియాలలో 600మగ్గాలపై ప్రసిద్ధ కంచిపట్టు చీరల తయారీ జరిగేది. ఈ చీరలు నేస్తూ 1500 మందికి పైగా ఉపాధి పొందేవారు. కంచి పట్టుచీరల పరిశ్రమపై పరోక్షంగా 10 వేల మందికిపైగా ఆధారపడేవారు.
"చీరల వ్యాపారం కరోనా ధాటికి కళ కోల్పోయింది. 20% చీరలే ప్రస్తుతం అమ్ముడవుతున్నాయి. మార్కెట్ సౌకర్యం లేక ఈ సమస్య తలెత్తుతోంది. కరోనా వల్ల కుదేలైన ఈ వ్యాపారానికి ఉద్దీపన అందిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దానికోసం దరఖాస్తు చేసుకున్నాం."
- రాము, చేనేత కళాకారుడు
తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా
నాణ్యతపరంగా కంటిపట్టు చీరలు చాలా ప్రసిద్ధం. గిరాకీ కూడా ఎక్కువే. దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతాయి. కరోనా పరిస్థితులతో నేతకార్మికులు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారంలో తీవ్రనష్టాల పాలవుతున్నారు. ఆర్థికవ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా మైసూర్ రాజులు ప్రారంభించిన వస్త్ర పరిశ్రమ ద్వారా.. ఎంతోమంది ఆర్థిక స్వావలంబన సాధించారు. కానీ కరోనా ఏకంగా పరిశ్రమనే సంక్షోభంలోకి నెట్టేసింది.
చేకూరని లబ్ది
వ్యాపారంలో యజమానులు, సిబ్బంది.. ప్రస్తుతం గడ్డుకాలమే గడుపుతున్నారు. చేనేత, వస్త్ర వ్యాపారాలు దుకాణాలు మూసివేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో చేనేతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కానీ ఇప్పటివరకూ కంచిపట్టు చీరల తయారీ వెనక ఉన్న ఆ కళాకారులకు లబ్ది చేకూరలేదు.
ఇదీ చదవండి: గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం