అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ... ఈ గౌరవం సాధించిన ప్రముఖ భారతీయుల సరసన నిలిచారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ ఆయనను ఈ పురస్కారం వరించింది. ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికా ఆర్థిక వేత్త మైకేల్ క్రెమర్లతో కలిసి అవార్డును పంచుకోనున్నారు.
ముంబయిలో జన్మించిన ఈ 58 ఏళ్ల అభిజిత్.. ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అర్థశాస్త్రం బోధిస్తున్నారు. 1988లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, దిల్లీ జేఎన్‌యూలో విద్యనభ్యసించారు.
ఇదీ చూడండి: ముంబయి నుంచి నోబెల్ వరకు.. అభిజిత్ ప్రస్థానం
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత నోబెల్ పురస్కారం పొందిన అతి కొద్ది భారతీయులు, భారత సంతతి వ్యక్తుల సరసన చేరారు అభిజిత్.
1. ఠాగూర్
సాహిత్యరంగంలో చేసిన కృషికి గానూ భారతీయుల్లో మొట్టమొదటగా రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో నోబెల్ బహుమతి లభించింది. బెంగాలీ భాషలో రచించిన ఎన్నో భక్తిగీతాలను ఆంగ్లంలోకి అనువదించి... గీతాంజలి కావ్యాన్ని రచించారు. ప్రపంచ రచనల్లోనే గొప్పదిగా పేరుగాంచిన ఈ రచనకే సాహిత్యంలో ఠాగూర్‌ను నోబెల్ వరించింది.
2. సీవీ రామన్
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సీవీ రామన్ చేసిన కృషికి గానూ... ఆయనకు 1930లో నోబెల్ పురస్కారం లభించింది. కాంతి పరిక్షేపణంపై ఈయన చేసిన పరిశోధన 'రామన్ ఎఫెక్ట్' ఎందరి నుంచో ప్రశంసలను అందుకొంది.
3. ఖురానా
భారత సంతతికి చెందిన హర్గోవింద్ ఖురానా వైద్య విభాగంలో 1968లో నోబెల్ బహుమతి అందుకున్నారు. కృత్రిమ జన్యువుల రూపకల్పన, ప్రొటీన్ సంశ్లేషణ, జెనెటిక్ ఇంజినీరింగ్ ఆవిష్కరణకు గానూ మరో ఇద్దరితో కలిసి ఈ అవార్డును అందుకున్నారు.
4. మథర్ థెరీసా...
ఆల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ నన్ మదర్ థెరీసాకు 1979లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. భారత పౌరసత్వం స్వీకరించిన ఈమె కోల్‌కతాలో 'ది మిషనరీస్ ఆఫ్ ఛారిటీ'ని స్థాపించారు. దీని ద్వారా ఎందరో పేదలకు, రోగగ్రస్థులకు అసమానమైన సేవ చేశారు. వ్యసన పీడితుల నుంచి ఎయిడ్స్ బాధితుల వరకు సకల మానవాళికి తోడు నిలిచారు థెరిసా.
5. సుబ్రమణియన్ చంద్రశేఖర్
నక్షత్రాల పుట్టుక, పరిణామాలపై సరికొత్త కాంతిని ప్రసరింపజేసినందుకు చంద్రశేఖర్‌కు 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈయన చంద్రశేఖర్ లిమిట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
6. అమర్థ్యసేన్
అర్థశాస్త్రంలో చేసిన విశేష సేవలకు గానూ బంగాల్‌కు చెందిన ఆర్థిక వేత్త అమర్థ్యసేన్కు 1998లో నోబెల్ పురస్కారం లభించింది. సంప్రదాయ అర్థశాస్త్రం తరతరాలుగా విస్మరిస్తూ వచ్చిన 'జన సంక్షేమం' పైకి అందరి దృష్టీ మళ్లేలా చేయటం సేన్ సాధించిన ఘనత.
7. వెంకట్రామన్ రామకృష్ణన్
భారత సంతతికే చెందిన వెంకట్రామన్ రామకృష్ణన్ 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. రైబోజోమ్‌ల పనితీరు, నిర్మాణంపై చేసిన అధ్యయనానికి గానూ మరో ఇద్దరితో కలిసి ఈ అవార్డును పంచుకున్నారు.
8. కైలాశ్ సత్యార్థి
భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి... 2014లో పాకిస్థాన్ టీనేజర్ మలాలాతో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ''యువత, బాలల అణచివేతకు వ్యతిరేకంగా వారి పోరాటానికి, అందరు పిల్లలకూ విద్యాహక్కు'' కోసం ఉద్యమించిన కారణంగా ఈ అవార్డు దక్కింది.
తాజాగా ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొంది.... వీరి సరసన చేరారు.
ఇదీ చూడండి: నోబెల్ గ్రహీత అభిజిత్‌పై ప్రశంసల వెల్లువ
నోబెల్ బహుమతుల్ని 1901 నుంచి ఇస్తున్నారు. 2018 వరకు మొత్తం 590 సార్లు 935 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డు అందజేశారు. ఈ పురస్కారం కింద 9 మిలియన్ క్రోనార్ల నగదు, బంగారు పతకం, ప్రశంసా పత్రం బహుమానంగా పొందుతారు.