తమిళనాడులో ఇటీవల బోరుబావిలో పడ్డ చిన్నారి మరణం అందరినీ కలచివేసింది. ఏకంగా 80 అడుగుల లోతులో చిక్కుకున్న సుజిత్‌ను, నాలుగురోజుల వరకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించినా కాపాడలేకపోయాయి. ఈ ఘటన దేశంలో ఎంతోమందిని ఆవేదన చెందేలా చేసింది. అలా ఓ వ్యక్తి బాధలోనుంచి పుట్టిన ఆలోచన ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనిపెట్టేలా చేసింది.
మధురైలో నివాసముంటున్న అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి లోతైన బావిలో పడిపోయిన చిన్నారులను రక్షించేందుకు ఓ పరికరాన్ని కనుగొన్నాడు. ఈ సాధనానికి 'అంబ్రెల్లా రెస్క్యూ బేబీ' అని పేరు పెట్టాడు. దీని సాయంతో బావిలో చిక్కుకున్న చిన్నారులను త్వరగా రక్షించవచ్చు అంటున్నాడు.
నేను కనిపెట్టిన పరికరానికి అంబ్రెల్లా రెస్క్యూ బెబీ అని పెరు పెట్టాను. బోరుబావిలో పడిన చిన్నారి వద్దకు ఈ సాధానాన్ని పంపుతారు. ఆ తర్వాత పిల్లాడి కింద గొడుగులాగ.. ఈ పరికరం తెరుచుకుంటుంది. కేవలం రెండు నిమిషాల్లో చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకువస్తుంది. దేశానికి సేవ చేయడమే నా ముఖ్య ఉద్దేశం.
-అబ్దుల్ రజాక్, పరికరం సృష్టికర్త
పరికరం ఉపయోగం గురించి మధురై దక్షిణ ప్రాంతీయ కలెక్టరుకు వివరించినట్లు తెలిపారు రజాక్. ఈ పరికరం ఉపయోగంపై పూర్తిగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రజాక్ తెలిపారు.