సరిహద్దు ఉద్రిక్తతలపై శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ఆప్‌కు ఆహ్వానం అందలేదని ప్రకటించారు ఆ పార్టీ నేతలు. దిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతూ.. పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆప్‌ను ఆహ్వానించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆప్ నేత సంజయ్ సింగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. జాతీయ అత్యవసర పరిస్థితి వంటి సందర్భంలో అన్ని పార్టీలు ఐక్యం కావాలని చెప్పారు.
"దురహంకార పూరిత ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ప్రస్తుతం ఆమ్ఆద్మీ పార్టీ దిల్లీలో అధికారంలో ఉంది. పంజాబ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. దేశవ్యాప్తంగా నలుగురు ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ సరిహద్దు వివాదం వంటి కీలక అంశంలో భాజపా మా అభిప్రాయాన్ని వినాలని అనుకోవట్లేదు. సమావేశంలో ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది."
-సంజయ్ సింగ్, ఆప్ నేత
దురదృష్టకర పరిణామం..
ఆప్‌ను ఆహ్వానించకపోవడంపై స్పందించారు దిల్లీ ప్రభుత్వ మంత్రి గోపాల్ రాయ్. అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన సమయంలో ఎవరిని అఖిలపక్షానికి ఆహ్వానించాలనే అంశమై భాజపా మేథమేటిక్స్ ఫార్ములాలు వినియోగిస్తోందని చెప్పారు.
ఇదీ చూడండి: ఈ ఇనుప చువ్వలతోనే చైనా సైనికుల దాడి?