దిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై ఉత్తర్‌ప్రదేశ్‌లో దాడి జరిగింది. ఓ ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు రాయ్‌బరేలీలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయటకు వస్తున్న ఆయన ముఖంపై ఓ వ్యక్తి సిరా చల్లాడు.
ఎమ్మెల్యే అరెస్ట్..
ఈ ఘటన అనంతరం పోలీసులు సోమనాథ్ భారతిని అరెస్టు చేశారు. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేలా వ్యవహరించినందుకుగాను సోమనాథ్ భారతిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆయన్ను అమేఠీకి తరలించారు. ఆయనపై జరిగిన సిరా దాడి ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
సోమనాథ్ భారతిని కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. అనంతరం సుల్తాన్‌పుర్ జిల్లాలోని అమ్హత్ జైలుకు ఆయనను తరలించారు. సోమనాథ్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం వాదనలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
యోగి సర్కార్ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలపై సోమనాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనపై సిరా దాడి చేసినప్పుడు సైతం పోలీసులపై మండిపడ్డారు. యూనిఫాం చించేస్తానంటూ అరిచారు. యోగి మరణం ఆసన్నమైందంటూ వ్యాఖ్యలు చేశారు.
ఖండించిన ఆప్..
మరోవైపు, యూపీ సర్కార్ చర్యను ఆమ్‌ఆద్మీ పార్టీ ఖండించింది. సోమనాథ్ భారతిపై సిరా దాడి కలతకు గురిచేసిందని ఆప్ నేత సంజయ్ సింగ్ అన్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే యూపీ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. భారతిపై దాడిని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఇలాంటి దాడులు మానుకొని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఏర్పాటుపై యూపీ సర్కారు దృష్టిసారించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలపై విపక్షాల ఉమ్మడి పోరు!