వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన రోడ్‌షోలో అనుమతికి మించి ఖర్చు చేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు ఆమ్ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్. ఎన్నికల నిబంధనల ప్రకారం ఖర్చు పరిమితి రూ. 70 లక్షలకు మించొద్దని పేర్కొన్న ఆయన.. మోదీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రికంలో ప్రధాని మోదీ.. వారణాసి లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా ఉన్నారు.
వారణాసి ఎన్నికల అధికారికి లేఖ రాసిన సంజయ్ సింగ్ అందులో ఖర్చుల వివరాల్ని ప్రస్తావించారు. నిబంధనలు ఉల్లంఘించి మొత్తం రూ. కోటీ 27 లక్షలు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
భాజపా నాయకులు వారణాసి చేరుకోవడానికి ఉపయోగించిన ప్రైవేటు జెట్లకు రూ. 64 లక్షలు ఖర్చు చేశారని, వాణిజ్య విమానాల ద్వారా వచ్చిన 100 మందికి పైగా నేతలకు రూ. 15 లక్షలు వెచ్చించారని ఆరోపించారు.
హోటల్ ఖర్చులు 8 లక్షలు, వాహనాలకు రూ. 6 లక్షలు, ఆహారం, ఎన్నికల సామగ్రికి రూ. 5 లక్షల చొప్పున, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, సౌండ్ సిస్టమ్, వేదిక ఇతరత్రా కోసం రూ. 2 లక్షల మేర ఖర్చు చేశారని ఈసీకి అందించిన లేఖలో వివరించారు ఆప్ నేత.
ఒక రోడ్ షో నిర్వహణకు ఈసీ నిర్దేశించిన ఖర్చు పరిమితి రూ. 70 లక్షలని పేర్కొన్నారు సంజయ్ సింగ్. ఈ పరిమితికి మించి మోదీ వెచ్చించారని ఆరోపించిన సంజయ్ సింగ్.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
కేజ్రీవాల్‌పై భాజపా...
ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు భాజపా నాయకులు. ఓ ఎఫ్ఎమ్ రేడియో ప్రకటన కార్యక్రమంలో కేజ్రీవాల్ ఓటర్లను తప్పుదోవ పట్టించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు దిల్లీ భాజపా ప్రతినిధి ప్రవీణ్ శంకర్.