కేరళ కోజికోడ్ విమాన ప్రమాద ఘటనపై అధికారిక దర్యాప్తు చేపట్టేందుకు ఆధారాలను సేకరిస్తున్నట్టు ఏఏఐబీ(విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ) చీఫ్ అరబిందో హండ తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే ప్రాధమికంగా అంచనా వేయలేమన్నారు.
విమాన నిబంధనలు(ప్రమాదాల దర్యాప్తు)-2017, ఐసీఏఓ ఆన్నెక్స్ 13 కింద దర్యాప్తు చేస్తున్నట్టు హండ వెల్లడించారు.
"ప్రమాదాలను నివారించడం ఈ దర్యాప్తు ముఖ్య లక్ష్యం. అందువల్ల ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతుంది. అన్ని కారణాలను పరిగణనలోకి తీసుకుంటాం. అందువల్ల అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం సరైనది కాదు."
--- అరబిందో హండ, ఏఏఐబీ చీఫ్.
ప్రమాదంలో పైలట్లు లేదా ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్) వైఫల్యం ఉందా అని ప్రశ్నించగా.. 'ఈ విషయాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలకు స్పందించడం సరైనది కాదు' అని బదులిచ్చారు హండ. ఈ దర్యాప్తులో తమకు అవసరం ఉంటే విదేశీ సంస్థల సహాయం కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.
85 మంది డిశ్చార్జ్...
ప్రమాద ఘటనలో గాయపడ్డ 85 మంది ప్రయాణికులు బుధవారం డిశ్చార్జ్ అయినట్టు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
"నేటి వరకు.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 85 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు."
--- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.
ఈ నెల 7న దుబాయి నుంచి కోజికోడ్ విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వే పైనుంచి జారిపడి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు.
ఇదీ చూడండి:- వర్షాకాలంలో కోజికోడ్ విమానాశ్రయం మూసివేత