మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లా కర్మన్ఖేడీ గ్రామంలో అత్యంత అరుదైన వివాహం జరిగింది. ఓ మగ దూడకు, మరో ఆడ దూడకు గ్రామస్థులంతా అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.
'రెండు నెలల నుంచి ఈ మగ దూడ, ఆడ దూడ మా గ్రామంలో తిరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. వాటి మధ్య చాలా ప్రేమ ఉంది. రోజంతా రెండూ కలిసే ఉంటాయి. ఉదయాన్నే కలిసి ఇంటింటికీ తిరుగుతాయి. గ్రామస్థులు ఈ రెండు దూడలను నంది, కామధేనుగా భావించారు. అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం దూడలకు పెళ్లి చేశాం.'
-గ్రామ సర్పంచ్
దూడల వివాహమే కదా అని వారు తక్కువేం చేయలేదు. గ్రామస్థులంతా విరాళాలు ఇచ్చారు. దూడలను అలంకరించి గ్రామంలోని వీధుల్లో ఊరేగించారు. ప్రతి ఇంటి వద్ద నవ వధూవరులకు హారతులిచ్చారు. వధూవరులిద్దరి వైపు నుంచి హాజరయ్యేందుకు పండితులను కూడా పిలిచారు. మగ దూడ తరపున స్థానికంగా నివాసం ఉండే అర్జున్ సింగ్ ఠాకూర్, వధువు వైపునుంచి బచియాకు చెందిన తేజ్ సింగ్ ఆచార్య పాల్గొన్నారు. వీరందరూ గానా బజానాతో గుర్రాలపై ఊరేగుతూ వేడుకకు హాజరయ్యారు.
దూడల పెళ్లికి వచ్చిన అతిథులకు పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వధూవరులను అలంకరించి వినాయకుడి ఆలయంలో పూజలు నిర్వహించారు. హిందూ ఆచారం ప్రకారం వివాహం జరిపించారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు నవ వధూవరులు.