దేశ రాజధాని దిల్లీలో గత ఆదివారం దారుణం జరిగింది. ఇతర బాలురతో మాట్లాడుతోందనే అక్కసుతో తన స్నేహితుడే ఓ బాలికపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి నిలకడగా ఉంది. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
దిల్లీ లోనీ ప్రాంతంలో నివాసం ఉండే నిందితుడు, బాధితురాలికి గత మూడేళ్లుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఆదివారం బాలిక ఫర్స్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఆమె అక్క ఇంటికి వెళ్లిందన్నారు. అక్కడి నుంచే నిందితుడి ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
బాలుడితో వెళ్లింది నిజమేనని... కొంతదూరం ప్రయాణించాక ఓ శ్మశానం ముందు ద్విచక్రవాహనం ఆపేసి దాడి చేసినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఇతర అబ్బాయిలతో ఎందుకు మాట్లాడుతున్నావని నిందితుడు ప్రశ్నించగా ఇద్దరూ గొడవపడినట్లు తెలిపింది. విసిగిస్తుంటే అక్కడి నుంచి తాను వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా కత్తితో దాడి చేశాడని పోలీసులకు చెప్పింది.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.