కర్ణాటకలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. జైలులో ఉన్నప్పుడు తనకు సహాయం చేయలేదనే కోపంతో సోదరుడి కొడుకును చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ బాలుడిని అతి కిరాతకంగా హత్య చేసి వారి ఇంటి వాటర్ ట్యాంకులోనే మృతదేహాన్ని పడేశాడు.

ట్యాంకులో మృతదేహం...
దదపీర్, ఛామన్లు బెంగళూరులో మేస్త్రీ పని చేస్తున్నారు. హరప్పనహల్లిలోని ఓ యువతితో దదపీర్ ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఆ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలిసి వారి ప్రేమను హెచ్చరించారు. కోపంతో ఊగిపోయిన దదపీర్.. వారందరినీ చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబసభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై అత్యాచార కేసు నమోదు చేశారు. ఫలితంగా పోలీసులు దదపీర్ను అరెస్టు చేసి 15రోజుల పాటు జైలులో వేశారు.
జైలులో ఉన్న దదపీర్.. తనకు సహాయం చేయమని సోదరుడిని కోరాడు. కానీ ఛామన్ అందుకు అంగీకరించలేదు. దదపీర్ను పట్టించుకోలేదు. ఛామన్పై పగ పెంచుకున్నాడు దదపీర్. అతడి కొడుకును చంపి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నెల 22న ఛామన్ కొడుకు రియాన్ తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండటాన్ని దదపీర్ చూశాడు. ఆ బాలుడిని అక్కడి నుంచి మేడ మీదకు తీసుకెళ్లాడు. అక్కడే ఆ బాలుడిని చంపి... వాటర్ ట్యాంక్లో పడేసి వెళ్లిపోయాడు దదపీర్.

రియాన్ కనపడక ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. అన్ని చోట్లా వెతికారు. అయినా ఫలితం దక్కకపోయే సరికి నేలమనగల పోలీసులను ఆశ్రయించారు.

ఇది జరిగిన ఓ రోజు తర్వాత.. నీళ్ల కుళాయి నుంచి రక్తం వస్తుండటాన్ని గమనించాడు ఛామన్. వెంటనే అందరూ ఇంటిపైకి పరుగులు తీశారు. అతి కిరాతకంగా హత్యకు గురైన తమ కొడుకును చూసి విలపించారు ఆ తల్లిదండ్రులు.
రియాన్ హత్యను పోలీసులకు వివరించారు కుటుంబసభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా దదపీర్ను అరెస్టు చేశారు. ఇక్కడే అసలు నిజాన్ని బయటపెట్టాడు దదపీర్. తనకు సహాయం చేయలేదనే కోపంతోనే ప్రతీకారం తీర్చుకున్నట్టు వెల్లడించాడు.
ఇదీ చూడండి:- సౌండ్ తగ్గించమని అడిగితే.. చంపేశారు!