పెళ్లి పేరుతో ఓ ఉపాధ్యాయురాలిని మోసగించి రూ.34 లక్షలు దోచేసిన కేటుగాడిని కర్ణాటక పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఓ డేటింగ్ యాప్ ద్వారా నిందితుడు ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు తెలిపారు.
కేరళకు చెందిన జో అబ్రహాం మాథ్యూస్... బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా అతను కుటుంబంతో కలిసి కర్ణాటకలోనే ఉంటున్నాడు. జల్సాలకు, హైఫై జీవితానికి అలవాటు పడిన అతను.. డేటింగ్ యాప్‌లలో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని వారిని మోసం చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు.
డేటింగ్ మాయ
ఈ క్రమంలో మాథ్యూస్‌కి.. టిండర్ యాప్‌లో ఓ స్కూల్ టీచర్ పరిచయం అయ్యింది. తక్కువ సమయంలోనే వారికి స్నేహం కుదిరింది. తను వ్యాపారం చేస్తున్నానని, కార్లు అమ్ముతుంటానని ఆమెను నమ్మించాడు మాథ్యూస్. చివరకు ఆమె తన బుట్టలో పడిందని నమ్మకం కుదిరిన తరువాత.. పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. అతని మోసం తెలియక ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుంది.
తన పథకం పారిందని తెలుసుకున్న మాథ్యూస్.. తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందని, కొంత డబ్బు సాయం చేయమని అడిగాడు. దీనితో ఆమె 34 లక్షల రూపాయలు అతనికి అందించింది. అంతే ఆమెకు దొరకకుండా.. మాథ్యూస్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు.
చివరకు మోసం గ్రహించిన బాధితురాలు.. బెంగళూరులోని వివేకానగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా ఈ ఘరానా కేటుగాడిని పట్టుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు డేటింగ్ యాప్‌ల ద్వారా ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసినట్లు వెల్లడైంది.
ఇదీ చూడండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103