భోండ్సీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భూప్‌సింగ్ నగర్లో స్థానిక పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. మధ్యలో బంతి వెళ్లి ఓ వ్యక్తికి తగలింది. కోపంతో మరో పన్నెండు మందిని పోగు చేసి ఓ పిల్లాడి కుటుంబంపై దాడి చేశారు.
కుటుంబ సభ్యుల్లో కొందరు గాయపడ్డారు. తమను కాపాడటానికి ఎవరు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
"వారంతా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. గేట్ మూయడానికి ప్రయత్నిస్తున్న మా పిన్ని చేతిపై కొట్టారు. ఆడవాళ్లమంతా భయపడి డాబాపైకి వెళ్లిపోయాం. కింద బాబాయి, అన్నయ్య ఉన్నారు. వాళ్లను ఘోరంగా కొట్టారు. మేం పైనుంచి చూస్తునే ఉన్నాం. తలుపు వేయటం వల్ల మాకేమీ దెబ్బలు తగల్లేదు. కాపాడాలని గట్టిగా అరిచాం. కానీ ఎవరూ సాయం చేయడానికి రాలేదు. మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తామని వాళ్లు అన్నారు. మీరు అలా మాట్లాడకండి అని చెప్పాం. పాకిస్థాన్ వాళ్లను ఆ దేశానికే పంపేయాలని అంటూనే ఉన్నారు. పాక్‌తో మాకేం సంబంధం. ఆ దేశంతో మాకెలాంటి సంబంధం లేదని పైనుంచి అరుస్తూనే ఉన్నాం. "
-బాధిత కుటుంబ సభ్యురాలు
దర్యాప్తు చేస్తున్నాం: డీసీపీ
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని దక్షిణ గురుగ్రామ్ డీసీపీ హిమాన్షు గార్గ్ తెలిపారు. దాడిలో పాల్గొన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.
ఊహకందని దారుణం: అఖిలేశ్ యాదవ్
కుటుంబంపై జరిగిన సామూహిక దాడిని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఖండించారు.
"గురుగ్రామ్‌లో కుటుంబంపై జరిగిన దాడి ఊహకందనిది. దేశంలో సోదరుల మధ్య నాయకులు చిచ్చు పెడుతున్నారు. ద్వేషంతో ఏం నాశనం చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు."
-అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు
ఇదీ చూడండి:జమ్ము వేర్పాటువాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం