ఖనిజాలు ఎక్కడుంటాయనే ప్రశ్నకు ఎవరైనా ఠక్కున సమాధానం చెబుతారు 'భూమి'లో అని. మరి వాటిని వెలికితీయాలంటే మట్టిని తవ్వక తప్పదు. అదే సమయంలో ఎన్నో ఎకరాల వృక్ష సంపదతో పాటు ఆయా ప్రాంతాల్లోని భూమి పోషకాలను కోల్పోతోంది. అందుకే ఈ సమస్యలకు పరిష్కారం చూపేలా ముందడుగేసింది సుప్రీంకోర్టు. ఇందుకోసం రీ-గ్రీనింగ్(పచ్చదన పునరుద్ధరణ) అనే నిబంధనను తీసుకొచ్చింది. గనుల తవ్వకాల సంస్థలు ఒక ప్రాంతం నుంచి వేరేచోటుకు వెళ్లేముందు ఆయా మైనింగ్ ప్రాంతాల్లో గడ్డి, వృక్షసంపద పునరుద్ధరించేలా మైనింగ్ లీజుల్లో 'రీ-గ్రీనింగ్' నిబంధనను చేర్చాలని ప్రతిపాదించింది.
పర్యావరణ పరిరక్షణకు దేశ అత్యున్నత న్యాయస్థానమిచ్చిన ఉత్తర్వులను భారతీయులందరూ స్వాగతించాలి. అయితే ఇది జీవవైవిధ్యాన్ని దెబ్బతీయకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
సాంకేతికతలో మున్ముందుకు.. కానీ..
బహుశా నాగరికత మొదలైనప్పుడే ఖనిజాల కోసం గనుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఆఫ్రికాలో దాదాపు 43వేల ఏళ్ల క్రితమే మైనింగ్ మొదలైంది. ప్రకృతితో సామరస్యాన్ని లోతుగా అర్థం చేసుకుని అప్పట్లో రాతి పనిముట్లు, చేతులతోనే గనుల తవ్వకాలు జరిపారు. ఖనిజాలు మానవ జీవనం, అభివృద్ధికి అవసరమైనప్పటికీ భూమికి ఎలాంటి హాని కలిగించకుండా మైనింగ్ చేపట్టారు. అందుకే మనం ఇప్పటికీ ఆ పురాతన ప్రదేశాలను చూడగలుగుతున్నాం.
పూర్వీకులతో పోల్చితే.. భూగర్భంలోనూ అలవోకగా తవ్వకాలు చేపట్టే, ఎంతపెద్ద కొండనైనా రోజుల వ్యవధిలోనే పిండిచేయగల మైనింగ్ యంత్రాలను ప్రస్తుతం మనం అభివృద్ధి చేశాం. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించాం. కానీ ఆధ్యాత్మికం, పర్యావరణ పరిరక్షణలో మాత్రం చాలా అడుగులు వెనక్కు వెళ్లిపోయాం. అందుకే పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ముందడుగు వేసేందుకు పచ్చదనం పునరుద్ధరణకై సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సారహీనమవుతున్న నేలమ్మ
బాక్సైట్ నుంచి బొగ్గు వరకు భారతదేశంలో చాలా రకాల గనులున్నాయి. ఖనిజాలను వెలికితీసే వివిధ రకాల ప్రక్రియలు భూమి, నీటి నాణ్యతను దిగజార్చే అనేక విష అవశేషాలను మిగుల్చుతాయి. గనుల తవ్వకాల ప్రక్రియలో మొక్కలు పెరిగేందుకు అత్యవసరమైన భూమి పైపొర బాగా దెబ్బతింటోంది. అందుకే ఏదైనా ఓ మైనింగ్ సంస్థ ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లినప్పుడు.. కొత్త ప్రాంతంలో ఉండే భూమి పైపొర మట్టిని అక్కడి నుంచి తరలించి అప్పటికే తవ్వకాలు ఆపేసిన గనులను పూడ్చేందుకు వినియోగించాలి. ఇందుకోసం ఈ పరిశ్రమలన్నింటికీ ఓ నమూనాను రూపొందించాలి.
మైనింగ్ పూర్తయిన ప్రాంతాలు సాధారణంగా అసమాన స్థలాకృతిలో ఉంటాయి. అందుకే ఆయా ప్రాంతాల్లో తిరిగి పచ్చదనాన్ని పునరుద్ధరించేందుకు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు మొక్కల పెరుగుదలకు అత్యంత ఆవశ్యకమైన నత్రజని, పాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలతో పాటు నీటిని నిల్వచేసుకునే సామర్థ్యాన్ని నేల కోల్పోతుంది. మైనింగ్ వల్ల ఆయా ప్రాంతాల్లోని మట్టి.. లోహాలతో కలుషితమవుతుంది. పీహెచ్ స్థాయి అధిక మోతాదులో ఉండటం వల్ల భూమి సహజత్వాన్ని కోల్పోయి తిరిగి మొక్కలను పెంచేందుకు అనువుగా ఉండదు. బొగ్గు గనుల ప్రాంతాల్లో అయితే లవణీయత, సొడిసిటీ వంటి అదనపు సమస్యలు కూడా ఎదురవుతాయి.
'రీ-గ్రీనింగ్' కోసం కమిటీ
రీ-గ్రీనింగ్ అనేది స్థానిక వృక్ష, జంతుజాలాలను పునరుద్ధరించొచ్చు లేదా ఆక్రమణ జాతులు, నూతన కలుపు మొక్కలు, బంజరు భూములు వంటి కొత్త సమస్యలనూ సృష్టించొచ్చు. అందుకే పచ్చదన పునరుద్ధరణ కోసం జీవవైవిధ్య ఆధారిత నమూనాను ప్రోత్సహించేందుకు సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాలి. ఈ కమిటీలోని పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు మైనింగ్ జరిగిన ప్రాంతాలపై పూర్తి నివేదికను ఇచ్చే ముందు.. ఆయా ప్రాంతాల్లోని స్థానిక వృక్షజాలం, దేశీయ పద్ధతులను అధ్యయనం చేయాలి. అలాగే ఆయా ప్రాంతాల్లోని స్థానికులు, గిరిజనులకు కమిటీలో చోటు కల్పించాలి.
కమిటీ నివేదిక ఆధారంగా స్థానికేతర జాతులు, ఆక్రమణ రకాలను రీ-గ్రీనింగ్లో భాగంగా వినియోగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించకూడదు. పచ్చదనాన్ని వేర్వేరు పద్ధతుల ద్వారా పునరుద్ధరించొచ్చు. అందుకే పర్యావరణ హితంగా అడవులు, మొక్కలు పెంచేలా మైనింగ్ సంస్థలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించాలి.
రీ-గ్రీనింగ్ ప్రాథమిక దశలో పొదలు, గడ్డి కీలక పాత్ర పోషిస్తాయి. విస్తారమైన ఆకు చెట్లను నాటాలి. ఎందుకంటే అవి నేలలో ఎక్కువ సేంద్రియ పదార్థాలను చేర్చుతాయి. మొక్కలు నాటడం కూడా సహజసిద్ధ పద్ధతుల ద్వారానే చేయాలి. అలాగే స్థానికులకు జీవనోపాధి కల్పించేలా ఔషధ మొక్కలను నాటాలి. ఒకవేళ మైనింగ్ సంస్థలు ఆయా ప్రాంతాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించలేకపోతే.. వారిపై విధించే ఆంక్షలు కూడా కఠినంగా ఉండాలి.
వసుదైక కుటుంబం
భూమి పోషకాలను కోల్పోతే.. అక్కడి ప్రజలు జీవనోపాధి కోల్పోతారు. అందుకే ఆయా ప్రాంతాల్లో రీ-గ్రీనింగ్ చేపడితే ప్రజలు మరోసారి అడవులపై ఆధారపడి జీవనం సాగించొచ్చు. వసుదైక కుటుంబం గురించి కూడా మనం ఆలోచించాలి. జంతువులు, చెట్లు, భూమాతను రక్షించాల్సిన బాధ్యత మనందరిదీ. అందుకే భూమి పట్ల దోపిడీ ధోరణిని విస్మరించి.. నేలను పరిరక్షించే ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు ఎంతో మంది భూమిని తమ ఆధీనంలో పెట్టుకోవాలని, శాసించాలని చూశారు. అయితే భూమాత సహనాన్ని పరీక్షించే పనులను ఇకనైనా మానుకోవాలి.
(రచయిత- ఇంద్ర శేఖర్ సింగ్, నేషనల్ సీడ్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా పాలసీ అండ్ అవుట్రీచ్ డైరెక్టర్)