కరోనా పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్ సోకి ప్రాణాలు విడిచిన వారి మృతదేహాలను కూడా తమ పరిసర ప్రాంతాల్లోకి రావడానికి ఒప్పుకోవట్లేదు. అంత్యక్రియలు చేసే సాహసమే ఎవరూ చేయట్లేదు. కర్ణాటక మంగళూరులో ఉప్పనంగడిలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. వైరస్ సోకి మరణించిన ఓ వృద్ధ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పోలీసులు ఎంత ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఓ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సాయం చేస్తాడని తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి 12 గంటలకు అతని తలుపు తట్టారు.
మహిళ మృతదేహాన్ని దహనం చేయాలని పోలీసులు అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాడు ఉమేశ్ అమిన్. ఎంతో ధైర్యంతో ముందుకొచ్చాడు. ఒక్కడే అంత్యక్రియలు నిర్వహించాడు. ఉమేశ్‌కు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పోలీసులు. అడిగిన వెంటనే సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమేశ్‌కు దహన సంస్కారాలు చేసే అలవాటు లేదని చెప్పారు.
పోలీసులు ఎంతో చేస్తున్నారు..
కరోనాపై పోరులో పోలీసులు మనకోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపాడు ఉమేశ్. అర్ధరాత్రి తన సాయం కోరి వచ్చినప్పుడు కాదంటే సమాజానికి ద్రోహం చేసిన వాడినై ఉండే వాడినని చెప్పాడు.