న్యాయవాదమే కలిపింది..
తమిళనాడు చెన్నైలోని పుళియాంతోప్పుకు చెందిన శివకామి, నాగేశ్వరరావు దంపతులు తమ కొడుకు సుభాష్ కోసం పడుతున్న వేదన చూసి ఓ న్యాయవాది హృదయం చలించింది. ఎలాగైనా సాయపడాలని 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన పిల్లాడి కోసం మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. 24 గంటలు దాటినా ఫలితం దక్కలేదు.
కానీ, కొడుకు కోసం పరితపిస్తున్న తలితండ్రుల నిరీక్షణని పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాల వ్యవహారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అమెరికాకు చెందిన ఓ దంపతులు అనాథ పిల్లలను తమ దేశానికి తీసుకెళ్లి పోషిస్తున్నారని తెలిసింది. సుభాష్ తప్పి పోయిన కొద్ది రోజుల తరువాత వారు చెన్నైకి చెందిన ఓ అనాధ బాలుడిని తమ దేశం తీసుకెళ్లారని సీబీఐ విచారణలో తేలింది.
ఆ పిల్లాడి ఫోటోని సేకరించగా అతనే తమ బిడ్డ అని నాగేశ్వరరావు దంపతులు గుర్తించారు. అయితే ఆ అమెరికా దంపతులు న్యాయ పరంగా ఓ అనాధని తమ దేశం తీసుకెళ్లి అవినాష్‌గా పేరు పెట్టుకున్నామనీ మద్రాస్ హైకోర్టుకు లిఖిత పూర్వకంగా తెలిపారు.
పడిగాపుల ఫలితం ఎంత మధురమో..
అమెరికా న్యాయ విభాగంతోను సంప్రదించి పిల్లాడి తలితండ్రుల డీఎన్ఏ పరీక్ష నివేదికను అమెరికా పంపి, అవినాష్ డీఎన్ఏతో పోల్చి చూశారు. పరీక్షలో నాగేశ్వ రరావు దంపతులు సంతానమే అవినాష్ అని తేలినా అమెరికా నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఇరు దేశాల మధ్యనున్న చట్టపరమైన చిక్కుముడులు అడ్డుగా నిలిచాయి.
అమెరికా దంపతులను ఫోను ద్వారా నేరుగా సంప్రదించి అవినాష్‌తో నేరుగా మాట్లాడేలా న్యాయవాది సహాయం చేశారు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉన్న అవినాష్‌కు కన్న తలితండ్రుల గురించి తెలియగానే ఆనందంతో పొంగిపోయాడు. వారిని కలిసేందుకు భారత్ వచ్చాడు. ఇంకేముంది ఆ తల్లి గుండెల్లో ఎక్కడలేని సంతోషం చిగురించింది.
ఇరవై ఏళ్ల తర్వతా వచ్చి మూడు రోజులు తమతో గడిపి మళ్లీ అమెరికా వెళ్లిపోతున్నాడు అవినాష్. అయినా, ఇన్నాళ్లు తాను ఉన్నాడో లేదో తెలీక సతమతమయ్యాం కానీ ఇప్పుడు తానెక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ముద్దులతో వీడ్కోలు చెబుతోంది శివకామి.
ఇదీ చూడండి:ఓనమ్ ప్రత్యేకం: ప్రతీకార కథతో స్నేహపూర్వక కుస్తీ