దేశంలోని ఓ పది రాష్ట్రాల్లో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోందని వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం యాక్టివ్ కేసుల్లో 86 శాతం ఆ పది రాష్ట్రాల్లోనే నమోదవ్వడం ఇందుకు నిదర్శనమని స్పష్టం చేసింది.
భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య తొమ్మిది లక్షలు దాటిపోయిన వేళ... ఆరోగ్య శాఖ అధికారి రాజేశ్ భూషన్ మీడియాతో మాట్లాడారు. 'దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 50 శాతానికి పైగా మహారాష్ట్ర , తమిళనాడు రాష్ట్రాల నుంచి నమోదైనవే. మరో 39 శాతం కేసులు కర్ణాటక, దిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, తెలంగాణ, బంగాల్, గుజరాత్, అసోం రాష్ట్రాల నుంచి వెలువడ్డవే' అన్నారు. దేశంలో కోలుకున్న వారి సంఖ్య ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారికంటే1.8 రెట్లు ఎక్కువ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక 22 రాష్ట్రాల్లో.. ప్రతి పదిలక్షల మందిలో రోజుకు కనీసం 140 టెస్టులు చేస్తున్నట్లు తెలిపిన రాజేశ్ ప్రపంచ దేశాలతో పోలిస్తే... భారత్లో మరణాల రేటు తక్కువగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 2.6 శాతం మంది మృతి చెందుతున్నారని, ఈ రేటు క్రమంగా తగ్గుతోందన్నారు.
ఇదీ చదవండి: గాలి ద్వారా కరోనా.. అడ్డుకోవడం ఎలా?