సార్వత్రిక ఎన్నికల ముంగిట భారత ఎన్నికల సంఘం(ఈసీ) విశ్వసనీయతను ప్రశ్నిస్తూ మాజీ ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈసీ విశ్వసనీయత మునుపెన్నడూ లేనంత స్థాయికి దిగజారిందని ఆరోపించారు. ఈసీ పనితీరే ఇందుకు కారణమన్నారు. ఎన్నో ఆంటకాలను సమర్థంగా ఎదుర్కొంటూ దేశంలో ఎన్నికలు నిర్వహించిన ఈసీ... ఇప్పుడు విశ్వసనీయత సంక్షోభంతో సతమతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన కేసులపై స్పందించేందుకు ఈసీ భయపడుతోందని ఆరోపిస్తూ 66 మంది మాజీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు లేఖ రాశారు.
ఈ లేఖపై సంతకం చేసిన వారిలో రాజస్థాన్ మాజీ సీఎస్ సలాహుద్దీన్ అహ్మద్, పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రిబేరియో, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సర్కార్, దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, పుణె మాజీ పోలీసు కమిషనర్ మీరన్ బోర్వాంకర్ ఉన్నారు. వారి వాదనలకు బలం చేకూరే విధంగా పలు అంశాలను లేఖలో పేర్కొన్నారు.
లేఖలో ప్రస్తావించినవి...
- ఏశాట్ క్షిపణిపై ప్రధాని ప్రకటన చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదా? ప్రభుత్వ ప్రసార సంస్థ ద్వారా ప్రకటన చేయకూడదు. కానీ ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవలేదు.
- ప్రధాని మోదీ బయోపిక్ 'పీఎం నరేంద్ర మోదీ' చిత్రంపై ఈసీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇది ఓ రాజకీయ నేత ఉచితంగా ప్రచారం పొందేందుకు ఉపయోగపడుతుంది కదా. చిత్ర నిర్మాణం, పంపిణీ, ప్రచారాల ఖర్చులను తక్షణమే మోదీ ఎన్నికల వ్యయంలో కలపాలి.
- స్వతంత్రత, నిష్పక్షపాతం, సామర్థ్యం విషయంలో ఎన్నికల సంఘం రాజీ పడుతోంది. భారత సైన్యాన్ని మోదీ సేనగా అభివర్ణించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అదిత్యనాథ్పై ఈసీ చర్యలే ఇందుకు నిదర్శనం. చర్యలు తీసుకోకుండా కేవలం మందలించింది. ఇదే ధోరణి కొనసాగితే మన ప్రజాస్వామ్య భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.
- ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు పోలీసు అధికారులు, సీఎస్, పశ్చిమ్ బంగాలో నలుగురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. మరి తమిళనాడులో గుట్కా కుంభకోణం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీని తొలగించాలని విపక్షాలు కోరినప్పటికీ ఎందుకు ఈసీ పట్టించుకోలేదు?
ఇదీ చూడండి: భారత్ భేరి: సమరానికి సర్వం సిద్ధం