కరోనా పరీక్షల కోసం నిలిపివేసిన జపాన్ నౌక ‘క్రూయిజ్ షిప్’లో భారత్‌కు చెందిన ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. అయితే.. ఎంతమంది ఉన్నారన్నది మాత్రం వెల్లడించలేదు. గత కొన్ని రోజులుగా జపాన్‌లోని యొకొహామ పోర్టులో నిలిచిపోయిన నౌకలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీతో సహా ఐక్యరాజ్యసమితిని వారు కోరుతున్నారు.
65 మందికి కరోనా పాజిటివ్...
హాంకాంగ్‌లో దిగిన ప్రయాణికుడిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నందున 3,711 మందితో ప్రయాణిస్తున్న నౌకను యొకొహామలో నిలిపివేయగా.. అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారు. ఈ నౌకలో ఉన్నవారిలో మరో 65 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. దీనివల్ల నౌకలో ఈ వైరస్ బారిన పడిన సంఖ్య 130 కి చేరింది. మరోవైపు టోక్యోలోని భారత రాయబార కార్యాలయం నౌకలో ఉన్న భారతీయుల గురించి వెల్లడిస్తూ... ఇందులో ప్రయాణికలతో సహా సిబ్బంది కూడా ఉన్నారని ట్వీట్ చేసింది. కానీ అందులో ఎంతమంది ఉన్నారనే వివరాలు మాత్రం తెలపలేదు. కాగా నౌకలో సుమారు 160 మంది దాకా భారతీయులు ఉండొచ్చని సమాచారం.
మమ్మల్ని రక్షించండి...
తమను రక్షించాలని నౌకలో ఉన్న భారతీయులు కోరుతున్నారు. చెఫ్‌గా పనిచేస్తున్న వినయ్‌కుమార్ మరికొందరు భారతీయులతో కలిసి ఓ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకొన్నారు. వారికి అక్కడ ఎవరూ కరోనా పరీక్షలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని భారతీయులందరినీ వేరు చేసి.. వీలైనంత తొందరంగా తమను రక్షించాలని అభ్యర్థించారు.
దీర్ఘకాలిక రోగుల అవస్థలు...
కరోనా వైరస్ నేపథ్యంలో నౌకలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరూ మాస్కులు ధరించాలని, ఎవరి క్యాబిన్లలో వారే ఉండాలంటూ నౌకలో ఆంక్షలు విధించారు. ఇలాంటి నిబంధనలతో.. కిటికీలు లేని కేబిన్లలో ఉంటున్న దీర్ఘకాలిక రోగులు మందుల కోసం ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా పుట్టిన చోట 50 లక్షల మంది మాయం!