తబ్లిగీ జమాత్ సంస్థకు చెందిన 60 మంది విదేశీయులను భోపాల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వారంతా టూరిస్టు వీసాపై భారత్‌కు వచ్చి, ఇక్కడ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే వారిపై భోపాల్‌లోని పోలీసు స్టేషన్లలో వీసా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన 7 కేసులను నమోదు చేశారు. స్థానిక కోర్టులో వారి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం వల్ల అరెస్టు చేశామని శనివారం అధికారులు తెలిపారు.
గత మార్చిలో దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన కార్యక్రమానికి వారు హాజరైన విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు పోలీసులు. అరెస్టైన వారిలో కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజక్‌స్థాన్, టాంజానియా, దక్షిణాఫ్రికా, మయన్మార్ దేశాలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు.