తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభణ
తమిళనాడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొత్తగా అక్కడ 5,849 పాజిటివ్ కేసులు, 74 మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,86,492కు, మొత్తం మరణాల సంఖ్య 2,700కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 51,765 యాక్టివ్ కేసులుండగా.. 1,31,583 మంది బాధితులు కోలుకున్నారు.
కర్ణాటక విలవిల
కర్ణాటకలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4,764 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో కేవలం బెంగళూరు నగరంలోని కేసులే 2,050 వరకు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 55 మంది వైరస్ కారణంగా మరణించారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 1,519కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 47,069 యాక్టివ్ కేసులున్నాయి.
కేరళలో కరోనా కలవరం
కేరళలో కొత్తగా 1,038 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఒక్క తిరువనంతపురంలోనే 276 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 8,818 యాక్టివ్ కేసులున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
యూపీలో 16 లక్షల కరోనా టెస్టులు
ఉత్తర్‌ప్రదేశ్‌లో గత 24 గంటల్లో 2,308 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 20,825కి పెరిగింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 1,263గా ఉంది. రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ, మంగళవారం రాష్ట్రవాప్తంగా 45,650 కరోనా నిర్ధరణ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తంగా 16 లక్షలకుపైగా కొవిడ్ టెస్టులు చేసినట్లు వెల్లడించింది.
మణిపూర్ 'లాక్డౌన్'
కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగిపోతున్న నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 14 రోజుల వరకు రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలుచేయాలని నిర్ణయించింది.
హిమాచల్‌ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ అధికారికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తెలిపారు.