తమిళనాడులోని వృద్ధుడు కేరళ ప్రజల కోసం కష్టపడడం ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ... గణేశన్‌కు ఇది అలవాటే. పుదుకూటయి ప్రజలకు ఆయన సుపరిచితమే. అందరూ ఆయన్ను 515 గణేశన్ అని పిలుస్తారు.
గణేశన్... ఓ సామాజిక కార్యకర్త. ప్రజా సేవకు... అంబాసిడర్ కారే ఆయనకు ఆయుధం. ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా గర్భిణీలను తన కారులో ఉచితంగా ఆసుపత్రికి చేర్చారు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆరు వేల మృతదేహాలను తన కారులో తీసుకెళ్లాడు. ఇలా ప్రతిసారి కారుతో సాయం అందించే గణేశన్‌కు ఆ వాహనం నెంబరు 515 ఇంటి పేరుగా మారింది.
ఎనిమిదేళ్ల క్రితం పుదుకూటయి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు విరాళాల సేకరణ యాత్ర చేసి సాయం అందించాడు. ఇప్పుడు కేరళ వరద బాధితులకు బాసటగా నిలిచేందుకు యాత్ర చేపట్టాడు. జనాలున్న ప్రదేశంలో కారులోని మైకు పట్టుకుని తన ఆశయాన్ని ప్రజలతో పంచుకుంటాడు. నచ్చినవారు తన ఆలోచనను మెచ్చుకుని తోచినంత సాయం చేస్తున్నారు.
"నా తుది శ్వాస వరకు నా శక్తి మేర నేను సాయపడుతూనే ఉంటాను. తాత్కాలిక జీవితంలో పరులకు సాయపడాలనిపించి నేను ఇలా చేస్తున్నాను. నా సేవలకు నేను ఒక్క రూపాయి కూడా ఆశించను. ప్రభుత్వం వరద బాధితులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలి."
- 515 గణేశన్, సామాజిక కార్యకర్త
ఇదీ చూడండి:రాజస్థాన్ వరదలు: కోటా, సీకర్ జలదిగ్బంధం