కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత ఎవరన్న చర్చకు తెరపడింది. దిగువసభలో కాంగ్రెస్ పక్షనేతగా సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి నియమితులయ్యారు. బంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధీర్ అయిదో సారి ఎంపీగా గెలిచారు.
ఆయన నియామక పత్రాన్ని లోక్‌సభ సచివాలయంలో సమర్పించారు చౌదరి. బంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బహరాంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
"పార్టీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. నాపై పెద్ద బాధ్యతలు ఉంచారు. నా విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా. పౌర హక్కుల కోసం పోరాడిన కిందిస్థాయి కార్యకర్తను నేను. సాధారణ ప్రజానీకానికి సంబంధించిన అంశాలపై పార్లమెంటు వేదికగా పోరాటాన్ని కొనసాగిస్తా."
-అధీర్ చౌదరి, కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత
1999 ఎన్నికల నుంచి ఇప్పటివరకూ 5 సార్లు లోక్‌సభకు అధీర్ ఎన్నికయ్యారు. 1996 నుంచి 1999 వరకు బంగాల్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. 2012 - 2014 మధ్య యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
చీఫ్ విప్‌గా సురేశ్
కాంగ్రెస్ చీఫ్ విప్‌గా నియామకమైన కె. సురేశ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. కేరళలోని మెవెళిక్కర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చీఫ్ విప్‌గా అవకాశం ఇవ్వడం పట్ల పార్టీ అధిష్ఠానానికి సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా!