ఐదుగురు భారతీయులను మరణానంతరం ప్రతిష్ఠాత్మక డ్యాగ్ హామ్మర్స్జోల్డ్ మెడల్‌తో సత్కరించనుంది ఐక్యరాజ్యసమితి. 2019లో యూఎన్ పీస్ కీపింగ్ మిషన్లలో భాగంగా సేవలందిస్తూ ప్రాణాలు వదిలిన వీరికి ఈ అవార్డును ప్రదానం చేయనుంది. ఈ ఐదుగురితో పాటు మిలిటరీ, పోలీసు, సామాన్య ప్రజలు మొత్తం 83 మందికి ఈ మెడల్ ఇవ్వనుంది. విధుల్లో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన వీరందరినీ అంతర్జాతీయ యూఎన్ పీస్ కీపర్స్ డే సందర్భంగా ఈనెల 29న మరోమారు గుర్తు చేసుకోనుంది ఐరాస.
ఐదుగురు వీరే..
దక్షిణ సూడాన్‌లో యూఎన్ మిషన్ కోసం పని చేసిన మేజర్ రవి ఇందర్ సింగ్ సంధు, సార్జెంట్ లాల్ మనోత్రా టార్సెమ్, లెబనాన్‌లో విధులు నిర్వర్తించిన సార్జెంట్ రమేశ్ సింగ్, కాంగోలో పనిచేసిన ఎడ్వర్డ్ అగాపిటో పింటో, ప్రైవేట్ జాన్సన్ బెక్‌లు మరణానంతరం ఈ అవార్డును దక్కించుకున్నారు.
మరో భారత మేజర్కూ అవార్డు..
భారత ఆర్మీ మేజర్ సుమన్ గవానీని 2019 ఏడాదికిగానూ 'యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్' అవార్డుతో సత్కరించనుంది యూఎన్. ఈ అవార్డు ఓ భారతీయురాలికి దక్కడం ఇదే ప్రథమం. మే 29న ఈ అవార్డును అందుకోనున్నారు గవానీ.
యూఎన్ పీస్ కీపింగ్‌కు ఎక్కువ మంది సైనికులకు అందిస్తున్న ఐదో అతిపెద్ద దేశం భారత్. ప్రస్తుతం అబెయి, సిప్రస్, కాంగో, లెబనాన్, పశ్చిమాసియా, సూడాన్, దక్షిణ సూడాన్, సొమాలియా, వెస్టెర్న్ సహారాలో యూఎన్ పీస్ కీపింగ్ కార్యకలాపాలకు మొత్తం 5,400 మందికిపైగా పోలీసు, సైనిక బలగాల సాయాన్ని అందించింది భారత్.
ఇదీ చదవండి : నేడు తొలి ప్రధాని వర్ధంతి.. నివాళులర్పించిన మోదీ