తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. గురువారం మరో 4,343 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆ రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 98,392కి చేరినట్లు స్పష్టం చేసింది. మరో 57 మంది వైరస్ తీవ్రతకు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1,321కి చేరినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 41,047 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది. ఈరోజు 3,095 మంది డిశ్చార్జి కాగా.. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 56,021కి చేరినట్లు తెలిపింది.
ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
తమిళనాడులో గురువారం ఇద్దరు శాసన సభ్యులకు కరోనా నిర్ధరణ అయింది. రామాంతపురం జిల్లాకు చెందిన పరమకుడి నియోజకవర్గ ఎమ్మెల్యే శంతన్ ప్రభాకరన్, కల్లకురిచి జిల్లా ఉలుందుర్‌పేట్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు కుమారగురులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిరువురూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిక
కరోనా పాజిటివ్‌గా తేలిన వెంటనే పరమకుడి ఎమ్మెల్యే ప్రభాకరన్.. రామాంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఉలుందుర్‌పేట్ శాసనసభ్యుడు కుమారగురు.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2016 ఎన్నికల్లో ప్రముఖ నటుడు, డీఎండీకే నేత విజయ్‌కాంత్‌పై అన్నాడీఎంకే తరపున పోటీచేసి విజయం సాధించారు కుమారగురు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీలలో సభ్యుడిగా ఉన్నారు.