దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి చాలా మంది ఒత్తిడికి గురవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఐదు నెలల కాలంలో ఒత్తిడితో బాధపడుతున్నవారి సంఖ్య 43 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇందుకు లాక్డౌన్ కూడా ఓ కారణమని వివరించింది.
సుమారు 10 వేల మంది భారతీయులపై ప్రముఖ ఆరోగ్య వేదిక 'గోఖీ' అధ్యయనం చేసింది. ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నారో పరిశోధన చేసింది. నిద్ర సమయం, ఆసక్తులు, పనులు, శక్తి వంటి 9 అంశాలకు సంబంధించి వివరాలు సేకరించింది.
43 శాతం మంది..
ఇందులో 26 శాతం మంది స్వల్ప ఒత్తిడికి గురవుతున్నట్లు వెల్లడించారు. 11 శాతం మధ్యస్థ, 6 శాతం మంది తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలిపారు.
ఈ కాలంలో సుమారు 59 శాతం మంది కొన్ని విషయాల్లో స్వల్ప ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. 38 శాతం కొద్ది రోజుల పాటు ఆందోళన చెందినట్లు స్పష్టం చేశారు. 9 శాతం మంది సగం రోజులు, 12 శాతం మంది పూర్తికాలం ఆందోళనలోనే ఉన్నట్లు వెల్లడించారు. మరో 57 శాతం మంది అలసట, అశక్తతగా భావించినట్లు తెలిపారు.
"మహమ్మారి వ్యాప్తి మొదలైన ఐదునెలల కాలంలో పౌరుల మానసిక ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం ఏర్పడింది. లాక్డౌన్లు, ఉద్యోగ కోతలు, ఆరోగ్య పరిస్థితులు, అనిశ్చితి కారణంగా చాలా మందిలో ఒత్తిడి పెరుగుతోంది. ఇది కుంగుబాటుకు దారితీస్తోంది."
- గోఖీ నివేదిక
ఏం చెయ్యాలి?
రోజువారీ కార్యక్రమాలను మెరుగుపరుచుకోవటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని అధ్యయనం తెలిపింది. దీని వల్ల ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలై ఒత్తిడిని తగ్గిస్తుందని స్పష్టం చేసింది. ఆరోగ్య అలవాట్లు, పోషకాహారంతో ఒత్తిడిని జయించవచ్చని వివరించింది.
ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 48,512 కేసులు.. 768 మరణాలు