బాలికలకు సెల్‌ఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే తల్లిదండ్రుల్లో కాస్త భయం. ఇవి అంత సురక్షితమైనవి కావని, వారి దృష్టిని మళ్లిస్తాయన్న అభిప్రాయం నెలకొంది. యుక్తవయసులోకి వచ్చిన బాలికలల్లో కేవలం 42 శాతం మందికి మాత్రమే రోజులో కేవలం ఒక గంట సేపు సెల్‌ను చూడడానికి తల్లిదండ్రులు అంగీకరిస్తున్నట్టు సర్వేలో తేలింది.
దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ కెటలైజింగ్ ఛేంజ్(సీ 3) అనే స్వచ్ఛంద సంస్థ ... డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ సహకారంతో దేశవ్యాప్తంగా ఈ సర్వే చేసింది. 10 రాష్ట్రాల్లోని 29 జిల్లాలకు చెందిన 4,100 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. బాలికలతో పాటు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులను కలిసింది. యుక్తవయసుకు వచ్చిన బాలికలకు సెల్ ఫోన్ సౌకర్యం కలగడం కష్టంగా మారినట్టు ఈ పరిశీలనలో తేలింది.
- కర్ణాటకలో బాలికలకు సెల్‌ఫోన్ సౌకర్యం లభ్యత గరిష్టంగా ఉంది. ఇక్కడ 65 శాతం మందికి అందుబాటులో ఉంది.
- హరియాణాలో బాలురకు సెల్‌ఫోన్ ఇస్తున్నా బాలికల విషయానికి వస్తే వెనకడుగు వేస్తున్నారు.
- తెలంగాణలో బాలురు-బాలికల తేడా చాలా స్వల్పంగా ఉంది. ఈ తేడా ఇక్కడ కేవలం 12 శాతమే.
- బాలికలు అయినందునే సెల్‌ఫోన్లు ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు కూడా అంగీకరించారు.
- ఇంట్లో కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలు ఉన్నా ప్రథమ వినియోగదారులు మగవారే.
- బాలికలకు ఫోన్ కొనిచ్చే స్తోమత లేదని 81 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు .
- సెల్‌ఫోన్ వినియోగంలోనూ బాలికలు వెనుకబడి ఉన్నారు. కాల్స్ రిసీవ్ చేసుకోవడం గురించి కేవలం 32 శాతం మందికే తెలుసు. కాలిక్యులేటర్, టార్చి, తదితర సౌకర్యాల గురించి 26 శాతం మందికే తెలుసు.
- ఆన్లైన్ యాప్‌ల గురించి 15 శాతం మందికే అవగాహన ఉంది.
- తమ పిల్లలకు కంప్యూటర్ల గురించి ఏమీ తెలియదని 16 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు.
ఆదివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అపరాజిత గొగొయ్ ఈ నివేదికను విడుదల చేశారు.