దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ ఉద్ధృతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో 20 వేల పడకలను సిద్ధం చేయాలని జిల్లా అధికారులను, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించింది కేజ్రీవాల్ సర్కార్.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మొత్తం 40 హోటళ్లను, 80 ఫంక్షన్ హాళ్లను వైద్య కేంద్రాలుగా మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాయువ్య జిల్లా పాలనాధికారులు మొత్తం 22 ఫంక్షన్ హాళ్లలో 3,300 పడకలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఫంక్షన్‌హాళ్లు.. నర్సింగ్ హోంలుగా, హోటళ్లు.. ఆసుపత్రులుగా సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
కేజ్రీ సర్కార్ రూపొందించిన 'దిల్లీ కరోనా యాప్' వివరాల ప్రకారం నగరంలో 9,850 పడకలు ఉండగా.. వీటిలో 5,448 పడకల్లో కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా.. మరో 4,402 పడకలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. హోటళ్లలో 4 వేల పడకలు, ఫంక్షన్ హాల్స్‌లో 11 వేల పడకలు, నర్సింగ్ హోంల్లో 5 వేల పడకలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
మరో రెండు రోజుల్లో దిల్లీలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని రెండింతలు పెంచనున్నట్లు కేంద్ర హెం మంత్రి అమిత్ షా తెలిపారు. అనంతరం సామర్థ్యాన్ని మూడింతలు చేస్తామని స్పష్టం చేశారు. దిల్లీలో పడకల కొరత దృష్యా అన్ని సౌకర్యాలతో కూడిన 500 రైల్వే కోచ్‌లను అందివ్వనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ నుంచి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు. వీటిని అక్కడ ఉన్న రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మారుస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి మొదలవాల్సిన ఐదు రైళ్లను పాత దిల్లీ రైల్వే స్టేషన్ నుంచి నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీచూడండి: వ్యాక్సిన్‌కు చేరువలో చైనా- రెండు క్లినికల్ ట్రయల్స్ పూర్తి