'అయోధ్య' అనగానే దశాబ్దాలుగా సాగిన రామమందిరం, బాబ్రీ మసీదు భూవివాదమే గుర్తొస్తుంది. ఈ కారణంతో అక్కడ హిందూ ముస్లింలకు విభేదాలు ఉన్నాయని ఊహించుకుంటారు చాలా మంది. అలాంటి వారి అనుమానాలన్నీ పటాపంచలు చేస్తున్నారు రాంనగరి వాసులు. ఎన్నో ఏళ్లుగా పూజారులకు 'ఖడావ్' (పావుకోళ్లు)లు తయారు చేస్తూ సోదరభావాన్ని చాటుతున్నారు.
స్వచ్ఛమైన మనసుతో..
ఈ చెక్క పాదరక్షల వ్యాపారంలో పెద్దగా లాభాలు లేకపోయినా వారి వృత్తిని వీడలేదు ముస్లింలు. 'హిందువులకు మేం చెప్పులు తయారు చేయడమేంటని?' వారు ఏనాడూ అనుకోలేదు. హిందవులూ.. 'ముసల్మాన్లు తయారు చేసిన పాదరక్షలు మేమెలా తాకుతాం?' అని భావించలేదు. మసీదులో నమాజ్ చదివి వచ్చి, స్వచ్ఛమైన మనసుతో ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు వీరు.
20-22 రూపాయలు వెచ్చించి తయారు చేసే ఈ పాదరక్షలను కేవలం 25-30 రూపాయలకే విక్రయిస్తూ అతి తక్కువ లాభాన్ని పొందుతున్నారు ముస్లింలు. నగరంలోని దాదాపు 8 వేల ఆలయాల్లో పూజలు చేస్తోన్న అర్చకులకు ఇక్కడ నుంచే ఈ ఖడావ్ (పావుకోళ్లు) సరఫరా అవుతాయి.
"ఎన్నో ఏళ్లుగా మేము ఈ వృత్తిలోనే స్థిరపడ్డాము. మా తాతా, నాన్న ఈ పనే చేసేవారు. ఆయన తర్వాత నేను. వీటిని తయారు చేసి ఆఖరి మెరుగులు దిద్దేందుకు కర్మాగారానికి తరలిస్తాం. ఆ తరువాత మార్కెట్లో అమ్మకానికి తీసుకొస్తాం. ఈ పాదరక్షల వ్యాపారం అంత పెద్దగా ఏమి నడవడంలేదు. పొట్టకూటికి సరిపోతుంది."
-ఆజమ్ ఖాన్, తయారీదారుడు
'భాయ్' భావంతో...
అయోధ్య నగరం ఓ ఆధ్యాత్మిక ప్రపంచం. ఇక్కడ సుమారు 8 వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. 5 జైన తీర్థాలున్నాయి. ప్రాచీన బౌద్ధులు ఈ నగరాన్ని సాకేత్ అని పిలిచేవారు. మొగలుల శాసనాల ప్రకారం అయోధ్య వారి రాజధాని. ఆ సమయంలోనే ఇక్కడ ఎన్నో మసీదులు వెలిశాయి. క్రమంగా ముస్లింల సంఖ్య పెరుగుతూ వచ్చింది. భిన్న మతాల సమ్మేళనమైన ఈ ప్రాంతం ఇప్పటికీ సోదరభావానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది.
ఇదీ చదవండి:ఉద్యోగులకు తీపి కబురు- 4 శాతం డీఏ పెంపు