రహదారుల వెంట ఉండే పశువులు సినిమా పోస్టర్లు, ప్లాస్టిక్ కవర్లు తినడాన్ని చూస్తూనే ఉన్నాం. పొట్టలో చేరిన వ్యర్థాలను ఆపరేషన్ ద్వారా బయటకు తీయడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అయితే ఓ ఆవుకు సర్జరీ చేసి ఏకంగా 35 కిలోల ప్లాస్టిక్, ఇనుము వ్యర్థాలను బయటకు తీసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఇదీ జరిగింది..
నాసిక్ జిల్లా పిమల్ గ్రామానికి చెందిన జయంత్ విదాతే అనే రైతుకు చెందిన ఆవు కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆవును పశువైద్యుడికి చూపించాడు రైతు. వైద్య పరిశీలనలో ఆవు ఇనుము, ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్నదని నిర్ధరణ అయింది. మూడు గంటల పాటు చేసిన సర్జరీలో ఇయర్ ఫోన్ పిన్నులు, పతంగులు ఎగరేసేందుకు వాడే మాంజా దారం, రెండు నాణేలు, ఓ టోపీ, కొన్ని వైర్లు సహా భారీస్థాయిలో ప్లాస్టిక్, ఇనుము వ్యర్థాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆవు ప్రాణానికి ప్రమాదమేమీ లేదని వైద్యుడు వెల్లడించారు.
ఇదీ చూడండి: టేస్టీ 'స్టఫ్డ్ ఎగ్..' నూనె లేకుండా సింపుల్గా చేసుకోండిలా!