ఇరాన్‌లోని 300మంది కరోనా అనుమానిత భారతీయుల నమూనాలను ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకొచ్చారు అధికారులు. ఈ నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)లో పరీక్షించనున్నారు. ఒకవేళ వీరికి కరోనా లేదని తేలితే.. దేశంలోకి అనుమతించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. వైరస్ వల్ల ఇప్పటి వరకు 145మంది మరణించారు. ఆ దేశంలో దాదాపు 2,000 మంది భారతీయులున్నారు.
యూఏఈలో మరో భారతీయుడికి..
యూఏఈలో కొత్తగా కరోనా సోకిన 15మందిలో ఒక భారతీయుడున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. వీరిలో 13మంది విదేశీయులున్నట్లు చెప్పారు. యూఏఈలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45కు చేరింది.
52 ప్రయోగశాలలు..
దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో నమూనాలను పరీక్షించేందుకు 52 ప్రయోగశాలలను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. కరోనా అనుమానిత నమూనాల సేకరణకు మరో 57 కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మార్చి 6 నాటికి 3,404మంది నుంచి సేకరించిన 4,058నమూనాలను పరీక్షించినట్లు అధికాలు తెలిపారు. ఇందులో చైనాలోని వుహాన్ నుంచి వచ్చిన 654మంది నమూనాలున్నాయి.
కశ్మీర్లో రెండు అనుమానిత కేసులు..
కరోనా అనుమానంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిని 'హై వైరల్ లోడ్ కేసు'(వైరస్ లక్షణాలు అధికంగా ఉండటం)లుగా పేర్కొన్నారు అధికారులు. ముందస్తు జాగ్రత్తగా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని కశ్మీర్ వ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేశారు. పాఠశాలలకు మార్చి 31వరకు సెలవులు ప్రకటించారు.