చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ తాజా గణాంకాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కేరళలో మాత్రమే మూడు కేసులు నమోదయ్యాయని.. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని తెలిపింది.
15,991 మందిని పరిశీలనలోకి తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అనుమానం ఉన్న మరో 1,671 మంది నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 21 విమానాశ్రయాల్లో.. 2,51,447 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించినట్లు స్పష్టం చేశారు హర్షవర్ధన్.
" మొత్తం 645 మందిని వుహాన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చాం. వారందరినీ దిల్లీ సమీపంలో రెండు క్యాంపుల్లో ఉంచి ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. విమానాశ్రయాలు, అంతర్జాతీయ పోర్టులు, నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దులతో పాటు జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు జరుపుతున్నాం. కరోనా వైరస్‌పై పుణెలో ఉన్న జాతీయ వైరాలజీ సంస్థను నోడల్ ఏజన్సీగా నియమించాం. ఈ వ్యాధిపై పూర్తి స్థాయి పరిశోధనలు నిర్వహించే బాధ్యత కూడా వైరాలజీ సంస్థకే అప్పగిస్తున్నాం."
- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
క్రూయిజ్ షిప్లో 218కి చేరిన కేసులు
జపాన్ క్రూయిజ్ షిప్లో కరోనా సోకిన వారి సంఖ్య 218కి చేరింది. ఇందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. మొత్తం 3,711 మంది ఉన్న ఈ నౌకలో ప్రయాణికులు, సిబ్బంది సహా.. మొత్తం 138 మంది భారతీయులున్నారు.
చైనాలోనే 1,355 మంది మృతి
ప్రాణాంతక 'కోవిడ్-19' కారణంగా చైనాలో బుధవారం ఒక్కరోజే 254 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,367కు చేరింది. మరో 15 వేల నూతన కేసులు నమోదయ్యాయి.