దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా మరో ముగ్గురికి ఈ మహమ్మారి సోకినట్లు గుర్తించారు అధికారులు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 34కు చేరింది.
కొత్తగా నమోదైన మూడు కేసులు.. తమిళనాడు(1), జమ్ముకశ్మీర్‌లోని లద్దాఖ్(2) ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒమన్ దేశం నుంచి రాగా, లద్దాఖ్‌లో వైరస్ బారిన పడిన వారు ఇరాన్‌కు వెళ్లివచ్చినట్లు తేలింది.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
మోదీ సమీక్ష..
దేశంలో కరోనా వ్యాప్తిపై అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిర్బంధ కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందినట్లయితే అత్యవసర చికిత్సపై నియమాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజలు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు.
ఇదీ చూడండి: ఇరాన్‌లోని 300మంది భారతీయులకు కరోనా?