సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), భాజపా కార్యకర్తల మధ్య ప్రారంభమైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పరగణ జిల్లా కంకినార ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. తూర్పు బుర్దాన్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు మరో వ్యక్తిపై దాడి చేసి హతమర్చారు. కంకినార ప్రాంతంలో చనిపోయిన వారు మహమ్మద్ ముఖ్తార్, మహమ్మద్ హలీమ్గా గుర్తించారు అధికారులు.
దీదీ ఆగ్రహం
బంగాల్‌లో జరుగుతున్న గొడవలపై టీఎంసీ, భాజపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాడుల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన గొడవల్లో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 8 మంది టీఎంసీ నేతలేనని మండిపడ్డారు. మరో ఇద్దరు భాజపా నేతలున్నారని ప్రకటించారు. వీరందరి మృతిపై విచారణ జరుపుతామని దీదీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు భాజపా వీరిని హత్య చేసిందని ఆరోపించారు.
ఖండించిన భాజపా
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలను భాజపా ఖండించింది. జై శ్రీరామ్ అని నినాదాలు చేసినందుకు హావ్‌డా జిల్లాలో తమ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను తృణమూల్ కార్యకర్తలు ఉరితీసి చంపారని ప్రత్యారోపణలు చేసింది. దాడులపై జాతీయ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు భాజపా సీనియర్ నేత ముకుల్ రాయ్.
ఇదీ చూడండి: నేడు కేంద్ర కేబినెట్, మంత్రిమండలి భేటీ