ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీగా హిమపాతం నమోదైంది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పర్యటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బారాముల్లాలో రికార్డు స్థాయిలో మంచు కురిసింది. మరో రెండు రోజులు పాటు పెద్దఎత్తున మంచు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముగ్గురు మృతి..
కేంద్రపాలిత ప్రాంతం కశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ మంచు కారణంగా జనజీవనం స్తంభించింది.
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కు వచ్చిన ఏడుగురు విద్యార్థులు హిమపాతంలో చిక్కుకుపోయారు. వీరిలో ఒకరు మృతి చెందగా, గాయపడిన వారిని రాష్ట్ర విపత్తు భద్రత దళం కాపాడినట్లు అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి మరణించగా, సిమ్లాలో మరొక వ్యక్తి మరణించాడు.
విమాన సేవలు రద్దు...
జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్ జిల్లాలో రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైంది. బారాముల్లాలో గరిష్ఠంగా 9సెంటీమీటర్ల మంచు కురిసింది. మంచు కారణంగా శ్రీనగర్‌వైపు ప్రయాణించే పలు విమాన సేవలు రద్దయ్యాయి.
మంచు దుప్పటి...
మంచు భారీగా కురవటం వల్ల పలు ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు శ్వేత వర్ణంతో ప్రకాశిస్తున్నాయి. అడుగుల మేర రహదారుల మీద పేరుకుపోయిన మంచు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఫలితంగా ప్రయాణికులు తమ వాహనాలను రోడ్ల మీదే విడిచి వెళ్తున్నారు.
పర్యటకుల కష్టాలు...
కులూ- మనాలీలో మంచు కారణంగా పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు. గుల్‌మార్గ్, సోనోమార్గ్, లేహ్‌లోనూ భారీగా మంచు వర్షం కురుస్తోంది. చలిగాలులు వీస్తుండటం వల్ల జనం వణికిపోతున్నారు.
ఇదీ చూడండి:తాజా రాజకీయ పరిస్థితులపై రేపు విపక్షాల భేటీ