దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. బుధవారం ఒక్కరోజే 29,557మంది కొవిడ్ నుంచి రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఒక్కరోజులో కోలుకున్నవారి సంఖ్యలో ఇదే అత్యధికం. ఫలితంగా వైరస్ నుంచి బయటపడినవారి మొత్తం సంఖ్య 7,82,606కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 63.18 శాతంగా నమోదైంది. మరో 4,26,167 మంది చికిత్స పొందుతున్నారు.
మరణాల రేటు 2.41 శాతంగా ఉంది. కరోనా నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న సమర్థమైన వ్యూహాత్మక చర్యలు ఫలితంగానే మరణాల రేటు తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
కోటీ 50 లక్షలు దాటిన పరీక్షలు
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు వేగం పుంజుకున్నాయి. గత మూడు రోజుల్లోనే 10 లక్షల నమూనాలను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. బుధవారం రికార్డు స్థాయిలో 3,50,823 నమూనాలను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన నమూల సంఖ్య మొత్తం 1,50,75,369కు చేరింది. 12,38,635 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.
ఇదీ చూడండి: భారతీయ విద్యార్థికి ఆ వర్సిటీ నుంచి రూ.1.3 కోట్లు!