నిర్భయ కేసు దోషులకు ఉరి శిక్ష అమలు మళ్లీ వాయిదా పడింది. శనివారం ఉదయం 6 గంటలకు నలుగురు దోషుల్ని ఉరి తీయకుండా దిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
దోషుల అభ్యర్థనతో...
నలుగురు దోషుల్ని శనివారం ఉదయం 6 గంటలకు ఉరితీయాలని జనవరి 17న డెత్ వారెంట్ జారీచేసింది దిల్లీ కోర్టు. ఇందుకు అనుగుణంగా దిల్లీ తిహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే శిక్ష అమలుపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నలుగురు దోషులు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు మిగిలే ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యే వరకు ఉరిని వాయిదా వేయాలని కోరారు.
వాడీవేడి వాదనలు...
నిర్భయ దోషులు దాఖలు చేసిన వ్యాజ్యానికి వ్యతిరేకంగా వాదించారు తిహార్ జైలు అధికారులు. నలుగురిలో ఒకరి పిటిషన్ మాత్రమే పెండింగ్లో ఉందని.. మిగతా ముగ్గురినీ ఉరి తీయొచ్చని తెలిపారు. అయితే జైలు అధికారుల వాదనలను దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఖండించారు. నలుగురిలో ఒక్కరి వ్యాజ్యం పెండింగ్లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయకూడదన్న నిబంధన ఉందని తెలిపారు.
వాదనలు విన్న దిల్లీ కోర్టు.... ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది.