రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుల్లో ఒకరైన కామేశ్వర్ చౌపాల్.. ఈటీవీ భారత్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ నెల 19న దిల్లీలో ట్రస్టు తొలి సమావేశం జరగనున్న నేపథ్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆలయ నిర్మాణం, గుడి ఆకారం (డిజైన్) తదితరాలపై ఈ సమావేశంలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు.
"ఆలయ తుది ఆకారంపై ట్రస్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాదాపు 30 ఏళ్ల క్రితం అశోక్ సింఘాల్ సహా కొందరు సాధువులు ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి అన్న దానిపై పలు ఊహాగానాలు చేశారు. ఇప్పుడు దశాబ్దాలు గడిచాయి. ప్రస్తుత ప్రజలు చరిత్రలో నిలిచిపోయే బ్రహ్మాండమైన ఆలయం నిర్మించాలని కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆలయ నిర్మాణం జరిగేలా.. అపురూపమైన డిజైన్‌కే ట్రస్టు అంగీకారం తెలుపుతుంది."
- కామేశ్వర్ చౌపాల్, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు
'మహాత్మాగాంధీ రామరాజ్యం సాకారం'
ట్రస్టు సభ్యుల్లో దళితులకు కూడా ప్రాతినిథ్యం కల్పిస్తామని కేంద్రం చెప్పింది. అందుకు అనుగుణంగా దళిత వర్గానికి చెందిన బిహార్ భాజపా నేత చౌపాల్‌ను ట్రస్టులో భాగస్వామిని చేసింది. ఆలయ నిర్మాణం జరిగితే.. మహాత్మా గాంధీ కలలుకన్న రామరాజ్యం కూడా సాకారమవుతుందని చెప్పుకొచ్చారు చౌపాల్.
"శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ఒక గొప్ప రామాలయాన్ని నిర్మించాలన్న వారి ఆకాంక్ష నెరవేరుతున్నందుకు ఇవాళ దేశ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాదు మహాత్మాగాంధీ కలలు కన్న రామరాజ్యాన్ని నిజం చేసేందుకు ఇదొక సువర్ణావకాశంగా భావిస్తున్నాం."
- కామేశ్వర్ చౌపాల్, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు
ఎవరూ అసంతృప్తిగా లేరు
ట్రస్టులో తమను చేర్చలేదని రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో పాటు విశ్వహిందూ పరిషత్ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అసంతృప్తిగా ఉన్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు చౌపాల్.
"నేనుగానీ, నాకు సంబంధించిన సంస్థగానీ ఈ ట్రస్టును ఏర్పాటు చేయలేదు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణం కోసం ప్రవీణ్ తొగాడియా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అలాంటప్పుడు రామాలయ నిర్మాణం జరుగుతుంటే ఆయనెందుకు అసంతృప్తిగా ఉంటారు. అలాగే ట్రస్టులో తన పేరు లేదని నృత్య గోపాల్ దాస్ కూడా అసంతృప్తిగా లేరు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి గోపాల్ దాస్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆలయ నిర్మాణంలో ఆయనతో పాటు మిగతా సాధువులు, పూజారులు కూడా మాకు అండగా నిలుస్తారు."
- కామేశ్వర్ చౌపాల్, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు