దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతున్న తరుణంలో రాజస్థాన్ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకునే వార్తను అందించారు అధికారులు. కరోనా సోకిన ఇటలీ దేశస్థులతో జైపూర్‌లో సన్నిహితంగా మెలిగిన 68 మందికి కరోనా నెగటివ్‌గా వచ్చినట్లు ప్రకటించారు. మరో 8 మంది వైద్య పరీక్షల ఫలితాలు తెలియాల్సి ఉందన్నారు. అటు ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇప్పటి వరకు 175 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ తెలిపారు. అందులోని 157 మందికి కొవిడ్ లక్షణాలేమీ కనిపించలేదన్నారు. ముందు జాగ్రత్తగా 820 ప్రత్యేక గదులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పేటీఎం కార్యాలయం మూసివేత
తమ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా వచ్చినందున గుర్గావ్లోని సంస్థ కార్యాలయాన్ని 15 రోజులపాటు మూసేసింది పేటీఎం.
భారత్-ఇరాన్ మధ్య ప్రత్యేక విమానాలు
ఇరాన్లో చిక్కుకున్న 2000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విదేశాంగశాఖ తెలిపింది. రేపటి నుంచి ఇరాన్-భారత్ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. భారత్‌లోని తమ దేశస్థుల కోసం ఇరాన్ ప్రభుత్వం రేపు విమానాన్ని దిల్లీకి పంపనున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ప్రకటించారు. అలాగే ఇటలీ, దక్షిణ కొరియా దేశాల నుంచి భారత్‌లోకి అడుగుపెట్టే వారికి కరోనా నెగటివ్‌గా వచ్చినట్లు చూపే వైద్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికేట్) వెంట తీసుకురావాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.
ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి తనిఖీ
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు చేస్తున్న కరోనా పరీక్షలను తనిఖీ చేశారు కేంద్ర ఆరోగ్యాశాఖ మంత్రి హర్షవర్ధన్
మొఘల్ గార్డెన్స్ బంద్
ప్రజలతో నిత్యం కిటకిటలాడే దిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌ను ఈ శనివారం నుంచి మూసేస్తున్నట్లు తెలిపారు అధికారులు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మూసేవేయాల్సి ఉండగా కరోనా భయాలతో ఒకరోజు ముందుగానే సందర్శలకు అనుమతి నిరాకరించనున్నారు. అలాగే హోలీ ఉత్సవాలకు కూడా రాష్ట్రపతి దూరంగా ఉంటారని ఇదివరకే స్పష్టం చేశారు అధికారులు.