కరోనా సోకిన 17 మంది మారుతీ సుజుకీ ప్లాంట్ సిబ్బంది అదృశ్యం కలకలం రేపుతోంది. హరియాణా మనేసర్ ప్లాంట్‌లో పని చేసే వీరంతా ఎస్ఐఎస్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వారు. అదృశ్యమైన ఉద్యోగులు, వారి మేనేజర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
మారుతీ ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి జూన్ 17న స్థానిక పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయగా.. 17 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయమై వారి మేనేజర్‌కు సమాచారమిచ్చారు. వారంతా క్వారంటైన్లో ఉన్నారని ఆ మేనేజర్ ఆరోగ్య శాఖ అధికారులకు తెలిపారు. అయితే జూన్ 18న ప్లాంట్ వద్దకు వచ్చిన ఆరోగ్య శాఖ సిబ్బంది... రోగులు అదృశ్యమైనట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
'మా ఉద్యోగులు కాదు'
తమ ప్లాంట్‌లో కరోనా అనుమానితులుగా గుర్తించినవారు తమ ఉద్యోగులు కాదని.. వారంతా ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేసేవారని చెప్పారు మారుతి సుజుకీ అధికార ప్రతినిధి. అయితే కరోనా అనుమానిత సెక్యూరిటీ సిబ్బంది ప్రభావం రోజువారీ కార్యకలాపాలపై పడిందా అనే అంశమై స్పష్టత ఇవ్వలేదు సంస్థ.
50 రోజుల లాక్డౌన్ అనంతరం మే నెలలో మనేసర్ ప్లాంట్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించారు.
ఇదీ చూడండి: 'కరోనిల్' సేఫేనా? క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్ ఏంటి?