తమిళనాడులో ఘోరవిషాదం చోటుచేసుకుంది. కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో భారీ వర్షానికి 15 అడుగుల ఎత్తున్న ఓ ప్రహరీ గోడ పక్కనే ఉన్న ఇళ్లపై కూలింది. ఈ ఘటనలో వరుసగా ఉన్న నాలుగు ఇళ్లు పేకమేడలా కుప్పకూలాయి. 17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరంతా నిద్రిస్తోన్న సమయంలోనే ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సహా ఇతర శాఖల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
వరద హెచ్చరికలు...
కుండపోత వర్షాలకు తమిళనాడులోని భవాని నది పొంగి పొర్లుతోంది. నదిపై కట్టిన రిజర్వాయర్లో నీటి నిల్వ పూర్తి సామర్థ్యానికి చేరింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు వరదల హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
- ఇదీ చూడండి: తమిళనాట వరుణ బీభత్సం.. జనజీవనం అతలాకుతలం