కొవిడ్ మహమ్మారి ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ బుధవారం రాత్రి దేశంలోని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఈ పరీక్షలు వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా కొందరు విద్యార్థులు, వివిధ పక్షాల నేతలు, ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, సామాజిక ఉద్యమకారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీరు లేఖ రాశారు.
'12వ తరగతి ఉత్తీర్ణులైన లక్షలవిద్యార్థులు ఇప్పుడు తదుపరి అడుగుకోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్థుల కలలను చిదిమేయకూడదు. కొందరు నాయకులు తమ రాజకీయ అజెండాకోసం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కానీ మీ సమర్థవంతమైన నాయకత్వంలో తగిన జాగ్రత్తలతో షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణను పూర్తిగా సమర్థిస్తున్నాం' అని ప్రొఫెసర్లు లేఖలో పేర్కొన్నారు. ఇందులో సంతకం చేసిన వారిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన నాగమణి, సిద్ధిచైతన్య ఉన్నారు.
ఇవీ చూడండి:-